Published: 07-08-2019
గాంధీ సిద్ధాంతానికీ భారత్ పాతర: ఇమ్రాన్ ఖాన్

ఆర్టికల్-370ని మోదీ సర్కారు నిర్వీర్యం చేయడం భారత్-పాక్ మధ్య సంప్రదాయ యుద్ధానికి దారితీయొచ్చని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో భారత్‌లో మరిన్ని ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందన్నారు. కశ్మీరీలను ఎంత అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే, తమ హక్కుల కోసం వారు అంతగా పోరాటం చేస్తారన్నారు.
జమ్మూకశ్మీర్ సమస్య, ఆర్టికల్ 370 నిర్వీర్యం నేపథ్యంలో మంగళవారం పాకిస్థాన్ పార్లమెంట్ ఉభయ సభలు సమావేశమయ్యాయి. ఇందులో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. నేరుగా భారతీయ జనతా పార్టీని, మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీది జాత్యహంకార సిద్ధాంతమని.. ఆ పార్టీకి హిందువుల ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించడమనే తమ వ్యవస్థాపకుల జాత్యహంకార సిద్ధాంతానికి అనుగుణంగానే బీజేపీ పనిచేస్తోందన్నన్నారు.
భారత్‌ను ముస్లింలు 500-600 ఏళ్లపాటు ఏలినందునే బీజేపీకి ముస్లింలంటే ఆగ్రహం అని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఆరిక్టల్ 370ని నిర్వీర్యంతో జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతానికి బీజేపీ తూట్లు పొడిచిందన్నారు. కశ్మీర్ విషయంలో మహాత్మా గాంధీ సిద్ధాంతాలకూ భారత్ పాతరేసిందన్నారు. ఈ సమస్యను ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళతామని.. వీలున్న ప్రతిచోటా ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వ్యతిరేక చర్యలను దునుమాడాలని పిలుపునిచ్చారు. అన్ని పొరుగు దేశాల మాదిరిగానే భారత్‌తోనూ సత్సంబంధాల కోసం తాను ప్రయత్నాలు చేశానని, ఆవైపు నుంచి తిరస్కారమే ఎదురైందన్నారు.
కశ్మీరీలకు సాయం చేసేందుకు ఎంతదాకైనా వెళతామని, ఇందుకు తమ బలగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వా అన్నారు. మంగళవారం ఆయన తన కమాండర్లతో సమావేశం నిర్వహించారు. కశ్మీరీలకు చివరి క్షణం వరకూ పాక్ సైన్యం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
