తదుపరి లక్ష్యం ఉమ్మడి పౌరస్మృతి బిల్లు

మోదీ సర్కారు తదుపరి అడుగు ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశ పెట్టడం వైపేనా! ఆ దిశగా ఎన్డీయే సర్కారు నిర్ణయం తీసుకోనుందా? ఇటీవల పరిణామాలను పరిశీలిస్తే వీటికి ‘ఔను’ అనే సమాధానాలే వినిపిస్తున్నాయి. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, ఉమ్మడి పౌరస్మృతి.. ఇవన్నీ దశాబ్దాలుగా బీజేపీ ఎజెండాలో ఉన్నప్పటికీ ఆచరణలో సాఽధ్యమా? అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యేది! ప్రస్తుతం ఇలాంటి అనుమానాలకు అంతగా తావుండదేమో! 370 ఆర్టికల్‌ను మోదీ సర్కారు నిర్వీర్యం చేయడంతో బీజేపీ సర్కారు తన మేనిఫేస్టోలో ప్రకటించిన ‘హామీ’లను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా అడుగులు వేయనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభలో సంఖ్యాపరంగా, సిద్ధాంతపరంగా పరిమితులున్నా ట్రిపుల్ తలాక్ నిషేఽధ బిల్లు, 370 ఆర్టికల్ నిర్వీరం చేసే బిల్లు ఆమోదం పొందడం బీజేపీ సర్కారుకు ఊపునిచ్చింది. దీంతో ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేసేందుకు బీజేపీ ఇక ఎంత మాత్రం సందేహించకపోవచ్చునని విశ్లేషకులు అంటున్నారు.
