Published: 05-08-2019
ప్రత్యేక రాష్ట్రాలుగా జమ్ము, కశ్మీర్..

జమ్మూ కశ్మీరుపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకోనుంది. హిమాలయ పర్వత సానువుల్లోని కీలక రాష్ట్రాన్ని మూడు భాగాలు చేయనుంది! ఇప్పటి వరకూ కలిసి ఉన్న జమ్ము, కశ్మీర్ రెండు రాష్ట్రాలు కానున్నాయి! టిబెట్, చైనా, గిల్గిత్-బాల్టిస్థాన్ సరిహద్దులుగా కలిగిన లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం కానుంది! ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది! అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం, సోమవారం ఉదయం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నారు. ఆ వెంటనే, సంబంధిత బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. జమ్మూ, కశ్మీర్ వేర్వేరు రాష్ట్రాలుగా; లద్ధాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడడమే కాదు.. జమ్మూ కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370, 35ఏ కూడా పరోక్షంగా రద్దు కానున్నాయి.
పార్లమెంటు ప్రారంభం కావడానికి ముందే, సోమవారం ఉదయం 9.30 గంటలకు లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. నిజానికి, ప్రతి బుధవారం కేబినెట్ సమావేశమవుతుంది. కానీ, షెడ్యూలుకు రెండు రోజుల ముందుగానే మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుంది. కశ్మీర్‌ను మూడు ప్రాంతాలుగా విభజించే అత్యంత కీలక నిర్ణయం ఈ సందర్భంగా తీసుకోనుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అదే జరిగితే, 30వ రాష్ట్రం ఏర్పడుతుంది. 8వ కేంద్ర పాలిత ప్రాంతంగా లద్ధాఖ్ నిలుస్తుంది.
జమ్మూకశ్మీరును మూడు ప్రాంతాలుగా చేయడం ద్వారా ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడానికి కేంద్రం సన్నద్ధమైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్, ‘రా’ అధిపతి సామంత్ గోయల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇతర అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో కశ్మీర్‌లో పరిస్థితిపై కీలక చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అమర్‌నాథ్ యాత్రను నిలిపివేసి, యాత్రికులను శుక్రవారం లోపు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోటళ్లలో బస చేసిన టూరిస్టులనూ పంపేశారు. తాజాగా, శ్రీనగర్‌లోని నిట్ విద్యార్థులను వెంటనే ఇళ్లకు వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ రావద్దని స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీరులోని దాదాపు వందమంది క్రికెటర్లను ఢిల్లీకి తరలించారు. భారత జట్టు తరఫున ఆడిన ఇర్ఫాన్ పఠాన్ కూడా వారిలో ఉన్నారు. లద్ధాఖ్ వెళుతున్న బైకర్లను కశ్మీరు వ్యాలీలోనే నిలిపేశారు. దీనికిముందే, దాదాపు లక్షమంది అదనపు బలగాలను జమ్మూ కశ్మీర్‌లో మోహరించారు. అంతేనా, జమ్మూకశ్మీర్‌లోని కీలక ప్రదేశాల్లో బందోబస్తును పటిష్ఠం చేశారు. శ్రీనగర్, కశ్మీరు లోయలో భద్రత పెంచారు. సచివాలయం, పోలీసు ప్రధాన కార్యాలయం, విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. శ్రీనగర్ శివార్లలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని భావించిన ప్రాంతాల్లో అల్లర్లను అదుపు చేసే వాహనాలను సిద్ధంగా ఉంచారు. సోమవారం నుంచి జరగనున్న పరీక్షలను రద్దు చేశారు. ఇంటర్నెట్‌ను బంద్ చేశారు.
