Published: 04-08-2019
పాక్ సైన్యం దుష్ప్రచారం చేస్తోంది: భారత్

భారత సైన్యం సరిహద్దు వెంబడి క్లస్టర్ బాంబులు ప్రయోగించిందంటూ పాక్ సైన్యం ఆరోపించింది. ఉద్దేశపూర్వకంగా సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తోందని విమర్శించింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు చనిపోయారని పేర్కొంది. క్లసర్ బాంబులను ప్రయోగించడమంటే జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పాక్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ పేర్కొన్నారు. మరోవైపు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ కూడా ఇవే ఆరోపణలు చేశారు.
అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ భారత సైన్యం క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తోందన్నారు. క్లస్టర్ బాంబులకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విటర్‌లో షేర్ చేశారు. అయితే, పాక్ ఆరోపణలను భారత సైన్యం కొట్టిపారేసింది. పాక్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడింది. ఖురేషీ ట్విటర్‌లో షేర్ చేసిన ఫొటోలు క్లస్టర్ బాంబుకు సంబంధించినవి కావని, మోర్టార్ బాంబుకు సంబంధించినదని స్పష్టం చేసింది..
కొన్ని చిన్న చిన్న బాంబులను గుదిగుచ్చి ఒకే బాంబుగా ప్రయోగిస్తే అదే క్లస్టర్ బాంబు. ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉన్న శత్రుబలగాలపై దాడి చేసేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఈ క్లస్టర్ బాంబులను గగన తలంనుంచి గానీ, భూమిపైనుంచిగానీ ప్రయోగిస్తారు. భూమికి సుమారు ఒక కిలోమీటరు ఎత్తులో ఉండగానే దీనిని పేల్చేస్తారు. అందులో ఉన్న చిన్నచిన్న బాంబులు విడిపోయి ఎక్కువ దూరం వ్యాపించి భూమిపై పడగానే విధ్వంసం సృష్టిస్తాయి. దీనివల్ల జననష్టం ఆస్తినష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ క్లస్టర్ బాంబును ప్రయోగించినప్పుడు ఒక్కోసారి అది పేలకుండా నేరుగా భూమిపైకి పడిపోయి ల్యాండ్ మైన్స్‌గా రూపాంతరం చెందుతాయి.
