Published: 02-08-2019

నిరుపేదలైన అన్నార్తులకు తీవ్ర నిరాశ

రాష్ట్రంలోని నిరుపేదలకు అతి తక్కువ ధరలకే నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందజేసేందుకు గత ప్రభుత్వం నెలకొల్పిన ‘అన్న క్యాంటీన్లు’ అర్ధాంతరంగా మూతబడ్డాయి. రోజూ మాదిరిగానే ఈ ఫలహారశాలలకు గురువారం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కోసం వెళ్లిన అన్నార్తులకు అవన్నీ తాళాలు వేసి కనిపించాయి. గత కొన్ని నెలలుగా కేవలం రూ.15కి (అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలకు రూ.5 చొప్పున) ప్రతి రోజూ కడుపు నింపుకొంటున్న వీరందరికీ తీవ్ర నిరాశ ఎదురైంది. రాష్ట్రవ్యాప్తంగా 204 క్యాంటీన్లు మూతబడ్డాయి. ఇక వాటి కోసం రోజుకు ఎంత లేదన్నా కనీసం రూ.100 నుంచి రూ.120 వరకూ చెల్లించాల్సిన పరిస్థితి. అన్న క్యాంటీన్లకు అక్షయపాత్ర ఫౌండేషన్‌ సంస్థ ఆహారం సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే.
 
 
ఈ క్యాంటీన్ల స్థాపన, నిర్వహణలో పలు లొసుగులున్నాయని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం గత నెల 31వ తేదీ తర్వాతి నుంచి ఆహారం సరఫరా చేయనవసరం లేదని అక్షయపాత్ర సంస్థకు కొన్ని రోజుల క్రితం సూచించింది. నిజానికి గత ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ సంస్థ కాంట్రాక్టు కాలపరిమితి 2020 వరకూ ఉందని తెలిసింది. కాంట్రాక్టు కాలపరిమితి ఇంకా ఉండడం, తమకు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల బిల్లులు రావాల్సి ఉండడంతో తమనే కొనసాగిస్తారని అక్షయపాత్ర నిర్వాహకులు భావించారు. పురపాలక శాఖాధికారులు కూడా అలాగే భావించి, 31వ తేదీ రాత్రి లోగానే కొనసాగింపు ఉత్తర్వులు జారీ అవుతాయని చెబుతూ వచ్చారు. కానీ.. బుధవారం రాత్రి వరకు అలాంటి ఆదేశాలేవీ రాలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్షయపాత్ర ఫౌండేషన్‌ గురువారం ఉదయం నుంచి అన్న క్యాంటీన్లకు ఆహార సరఫరాను నిలిపివేసింది. పలు చోట్ల అధికారులు ఫలహారశాలలకు తాళాలు వేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు.