Published: 01-08-2019
విజయవాడ విమానాశ్రయంపై కేంద్రప్రభుత్వం కన్ను

నవ్యాంధ్రకు తలమానికమైన విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును ప్రైవేటీకరణ బాట పట్టించటానికి కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేయటం విస్మయాన్ని గొలుపుతోంది. నవ్యాంధ్రలో అతి పెద్ద విమానాశ్రయంగా నిలవటంతోపాటు రాజధాని ప్రాంతం, కోస్తాజిల్లాల ప్రజల అవసరాలను తీరుస్తున్న విజయవాడ అంతర్జాతీ య విమానాశ్రయం ప్రైవేటీకరణ బాటలో ఉందన్న సంకేతాలను కేంద్రప్రభుత్వం ఇవ్వటం వివిధ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగ వర్గాలను కలవరపెడు తోంది. కేంద్ర ప్రభుత్వం తాను నిర్దేశించుకున్న వంద రోజుల ప్రణాళికలలో ఇప్పటికే కొన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించటానికి రంగం సిద్ధంచేయటం మరింత ఆం దోళన కలిగిస్తోంది. వరుసగా రెండోసారి పూర్తి మెజారి టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వం లోని కేంద్రప్రభుత్వం ప్రైవేటీకరణకు తలుపులు తెరిచింది. ఈ క్రమంలో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల లో వంద రోజుల ప్రణాళికల పేరుతో ప్రైవేటీకరణ మం త్రాన్ని జపిస్తోంది. ఇటీవల రైల్వేలోనూ ఇదే ప్రైవేటీకరణ విధానాన్ని తీసుకురావటంతో బలమైన రైల్వే సంఘాలు ప్రతిఘటించటంతో బీజేపీ ప్రభుత్వం వెనుకడుగు వేసి నా చాపకింద నీరులా తన పని కానిచ్చేస్తోంది. ఇదే క్రమంలో విమానయానంపైనా దృష్టి సారించింది. నష్టా లలో ఉన్న ఎయిర్ ఇండియాకు ప్రోత్సాహకాలు అందిం చకుండా.. దానిని ప్రైవేటు సంస్థలకు అమ్మివేయటానికి విస్తృత ప్రయత్నాలు చేయటం రెండేళ్లలో సమూలంగా విక్రయించేలా డెడ్‌లైన్స్ నిర్దేశించుకోవటం కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు వస్తున్నాయి.
ఇదే సందర్భంలో దేశంలోని ఆరు విమానాశ్రయాలను తాజాగా ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం సిద్ధం కాగా ఇందులో మూడు విమానాశ్రయాల ప్రైవేటీకరణపై ప్రజాప్రయోజనం కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ మూడింటిని తప్పించి మిగిలిన విమానాశ్రయాలను శరవేగంగా ప్రైవేటీకరణ చేయటానికి యత్నిస్తోంది. దీంతో పాటు విజయవాడ వంటి ర్యాపిడ్ గ్రోత్ ఎయిర్‌పోర్టులను కూడా ప్రైవేటీకరణ బాట పట్టించాలనుకోవటంపై ఏపీలోని వివిధవర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. విజయవాడ ఎయిర్‌పోర్టును కనుక ఒకసారి చూస్తే .. దేశీయంగా శరవేగంగా వృద్ధిచెందుతున్న ఎయిర్‌పోర్టులలో ఒకటి. దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఎయిర్‌పోర్టులలో విజయవాడకు సాటిలేదు. విజయవాడ ఎయిర్‌పోర్టుకు చారిత్రక నేపథ్యం ఉంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో భారతదేశ సైనిక కార్యకలాపాలకు ఇది కేంద్రంగా ఉంది. భారతీయ యుద్ధవిమానాలు, మన సైనికులు ఇక్కడి నుంచే రెండో ప్రపంచ యుద్ధంలో పాలు పంచుకున్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తున్నాయి. విమానయాన సంస్థలకు విజయవాడ ఎయిర్‌పోర్టు కల్పవృక్షంగా ఉంది. విమానయాన సంస్థలు భారీ లాభాలను మూటగట్టుకుంటున్నాయి.
