Published: 25-07-2019
మరో నోటిఫికేషన్‌కు సిద్ధమైన ఏపీ సర్కార్

భూముల సమగ్ర సర్వేకు సిద్ధమవుతన్న సర్కారు గ్రామ స్థాయి నుంచే సర్వేయర్లను నియమించాలని నిర్ణయించింది. గ్రామ సచివాలయాలు ఏర్పాటు కానున్న 11,114 గ్రామాల్లో సర్వేయర్లను నియమించేందుకు సర్వేసెటిల్‌మెంట్ విభాగానికి అనుమతి ఇచ్చింది. గ్రామ అసిస్టెంట్ సర్వేయర్ హోదాలో శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టనున్నారు. ఐటిఐలో సివిల్ డ్రాఫ్ట్స్ మెన్, డిప్లొమా, ఆపై కోర్సులు చేసిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తుచేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి, రిజర్వేషన్, ఇతర నిబంధనలను వర్తింపచేస్తారు. నియామకాలకు సంబంధించిన కీలక విధివిధానాలు, ప్రతిపాదనలను బుధవారం ఖరారు చేశారు.
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇన్‌చార్జి భూ పరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) మన్మోహన్ ఈ అంశంపై కీలక భేటీ నిర్వహించి దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించారు. సీసీఎల్‌ఏ స్థాయిలో ఈ ప్రతిపాదనలను ఆమోదించి రెవెన్యూశాఖకు నివేదించారు. ఈ ప్రక్రియ కూడా బుధవాం రాత్రికే ముగిసినట్లు తెలిసింది. గురువారం లేదా శక్రవారం ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో భూ వివాదాలను పరిష్కరించేందుకు సమగ్ర భూ సర్వే చేయాలని నిర్ణయించింది.
దీనికిగాను గ్రామ స్థాయి నుంచే సర్వేయర్లు ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తోంది. ప్రస్తుతం మండలాల స్థాయిల్లో సర్వేయర్లు, ఉప సర్వేయర్లు పనిచేస్తున్నారు. మొత్తంగా 600కు మించి లేరు. వీరితో సమగ్ర భూ సర్వే అయ్యేపనికాదు. అందుకే సర్వేశాఖను గ్రామస్థాయి నుంచే బలోపేతం చేయాలని, త్వరలో ఏర్పాటుచేసే గ్రామ సచివాలయాల్లో గ్రామ సర్వేయర్లకు చోటుకల్పించాలని సర్కారు నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో రెవెన్యూ, సర్వే శాఖలు కార్యాచరణను సిద్ధం చేయడం ప్రారంభించాయి. 2000, అంతకుపైన జనాభా ఉండే గ్రామాల్లోనే సచివాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. తొలుత రెవెన్యూ గ్రామాల ప్రతిపాదన వచ్చినా ఆ సంఖ్య ఎక్కువగా ఉండటంతో గ్రామ సచివాలయాలు ఏర్పాటయ్యే సంఖ్యకే పరిమితం కావాలని నిర్ణయించారు. దీంతో 11,114 గ్రామ సర్వేయర్ పోస్టులు ఉంటే సరిపోతుందన్న నిర్ధారణకు వచ్చారు. గ్రామ అసిస్టెంట్ సర్వేయర్(గ్రేడ్-3) పోస్టులుగా వీటిని భర్తీచేయనున్నారు. రెగ్యులర్ అభ్యర్ధులతోపాటు లైసెన్స్ సర్వేయర్లకు రాతపరీక్షలో పాల్గొనే అవకాశం కల్పించాలని సర్వేశాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో 4,500 పైనే లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఉన్నారు. వీరిలో 3,500 మందికి ప్రభుత్వమే ప్రత్యేక శిక్షణ ఇచ్చింది.
