Published: 24-07-2019

రూపాయి లంచం లేకుండా పనులు

మండల రెవెన్యూ కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు, మున్సిపల్‌ కార్యాలయాల్లో అవినీతి ఆనవాళ్లు కనిపించడానికి వీల్లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు జిల్లాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం ‘ప్రజా స్పందన’పై మంగళవారం సచివాలయంలోని తన చాంబర్‌లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన సమీక్షించారు. స్పందనలో వచ్చిన వినతుల పరిష్కార శాతం పెరగడం.. క్రమంగా సమస్యలు తగ్గడంపై అధికారులను సీఎం అభినందించారు. ఈ నెల 12న 59ు పెండింగ్‌లో ఉన్న సమస్యలు.. ఈ నెల 19 నాటికి 24శాతానికి తగ్గడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక సరఫరాపై దృష్టి సారించాలని సూచించారు. కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యల పరిష్కారంలో ఇంకా క్వాలిటీ పెరగాలని ఆదేశించారు.
 
 
ఎమ్మార్వోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించే సమయంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లు పక్కపక్కనే ఉంటారు కాబట్టి పర్యవేక్షణతోపాటు నిర్ణయాలు కూడా త్వరితగతిన తీసుకోవాలని సీఎం సూచించారు. సదరు వీడియో కాన్ఫర్సెన్సులపై ఆరా తీశారు. పశ్చిమగోదావరి జిల్లాలో స్పందన సమస్యల పరిష్కారంలో ట్రాకింగ్‌ విధానం చాలా బాగుందన్నారు. ఎమ్మార్వో కార్యాలయాలు, పోలీసుస్టేషన్లలో అవినీతి పూర్తిగా అంతం కావాలని.. లంచాలు లేకుండా పనులు జరుగుతున్నాయని ప్రజలు అనుకోవాలని తెలిపారు. సబ్‌ రిజిస్ట్రార్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లోనూ అవినీతి కనిపించకూడదన్నారు. రూపాయికూడా లంచం లేకుండా పనులు జరుగుతున్నాయన్న పేరు రావాలని.. దీనికోసం కొన్ని నియమాలు, నిబంధనలు, ప్రమాణాలు తీసుకురావాలని కోరారు.