Published: 20-07-2019
75 శాతం ఉద్యోగాలు స్థానికులకే

పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో చేపట్టే పరిశ్రమలు, జాయింట్ వెంచర్లు, ప్రాజెక్టులన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. సంబంధిత పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన వారికి కచ్చితంగా జీవనోపాధి లభించడంతోపాటు స్థానికంగా ఉండే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుగా చట్టం చేయనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. శుక్రవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మరిన్ని బిల్లుల ముసాయిదాలను ఆమోదించారు. రూ.వంద కోట్లకు పైబడిన పనుల విలువ నిర్ధారణ, టెండర్ల ప్రక్రియ ఖరారుకు జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తొలి నుంచీ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే... సిట్టింగ్ జడ్జి అందుబాటులో లేకపోతే, రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించే వెసులుబాటును ముసాయిదా బిల్లులో కల్పించారు. టెండర్లను పిలవడానికి ముందుగానే అన్ని పీపీపీ, జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్పస్ వెహికల్ సహా అన్ని ప్రాజెక్టులపై న్యాయమూర్తి పరిశీలిస్తారు. పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటితే కమిషన్ పరిధిలోకి వస్తుంది. జడ్జికి సహాయంగా నిపుణులను నియమిస్తారు. అవసరమైన నిపుణులను జడ్జి కూడా కోరవచ్చు. పనుల వివరాలను వారం రోజులపాటు ప్రజలు, నిపుణులకు అందుబాటులో ఉంచుతారు. ఆ తర్వాత 8 రోజులపాటు జడ్జి వాటిని పరిశీలిస్తారు. జడ్జి సిఫారసులను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ముసాయిదా బిల్లులో స్పష్టం చేశారు. అలాగే.. ప్రజాబాహుళ్యంలో టెండర్ల సమాచారం పెట్టినప్పుడు సలహాలూ సూచనలు చేసిన వారికి తగిన రక్షణ కల్పిస్తారు. మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదన ఖరారు చేసి.. ఆ తర్వాతే బిడ్డింగ్ జరపాలని, అర్హత కలిగిన కాంట్రాక్టు సంస్థలన్నింటికీ సమాన అవకాశాలు కల్పించాలని బిల్లులో పేర్కొన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ ప్రక్రియను అడ్డుకోవాలని యత్నిస్తే, దాన్ని నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని కమిషన్ ఏర్పాటుచేసుకోవచ్చు.
