Published: 19-07-2019
కూల్చేస్తే చూస్తూ ఊరుకోం

‘ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి జోలికి వస్తే ఖబడ్డార్, మా నాయకుడి ఇల్లు పడేస్తే చూస్తూ ఊరుకోం’ అని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. జగన్ తండ్రి వైఎస్ హయాంలోనే ఆ ఇంటికి అనుమతులు ఇచ్చారని, తండ్రి చేసింది తప్పని జగన్ చెప్పగలరా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలో జగన్ ఉంటున్న ఇల్లు ఎవరి పేరుతో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నెల్లూరు రౌడీ అయిన మంత్రి అనిల్‌కుమార్ రౌడీయిజానికి మేమేమీ భయపడం. సభా సంప్రదాయాలు పాటించకుండా అహంకారంతో ప్రవర్తిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. మంత్రి అనిల్‌కి సీఎం కౌన్సెలింగ్ ఇస్తారో, క్లాస్ తీసుకుంటారో.. మీ ఇష్టం. లేకపోతే బాగోదు’ అని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. విద్యాశాఖ మంత్రి సురేశ్ శాసన మండలిలో సభా నియమావళికి విరుద్ధంగా నారా లోకేశ్ పేరు పెట్టి, ప్రభుత్వ నిధుల్ని మళ్లించి, అవినీతికి పాల్పడ్డారంటూ మాట్లాడడం దుర్మార్గమని మండిపడ్డారు. ‘ప్రభుత్వంలో ఒక శాఖ నిధులు మరో శాఖకు బదలాయిస్తే తప్పంటారా? వైస్సాఆర్‌లా, జగన్‌లా సాక్షి పత్రికకో, సండూర్ పవర్‌కో, బ్రీఫ్ కేసు కంపెనీల్లోకో మేమేమీ నిధులు పంపలేదు. ప్రభుత్వ నిధులు ప్రభుత్వంలో సర్దుబాటు చేయడం సహజమే. మేమేమీ హెరిటేజ్ కంపెనీకి నిధులు మళ్లించలేదు.’ అని అన్నారు.
