Published: 17-07-2019
తెలంగాణకూ కొత్త గవర్నర్ వస్తారా?

ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు... ఇవన్నీ ముగిసిపోయాయి! ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణ మధ్య చిట్టచివరి ప్రధాన ఉమ్మడి బంధం ‘ఉమ్మడి గవర్నర్’ హయాం కూడా ముగిసింది. ఏపీ గవర్నర్‌గా ఒడిసాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ నియామకంతో రెండు రాష్ట్రాలకు అన్ని కీలక వ్యవస్థలు ప్రత్యేకంగా ఏర్పాటైనట్లయింది. విభజన చట్టంలో హైదరాబాద్‌ను గరిష్ఠంగా పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉపయోగించుకునే వీలు కల్పించారు. అయితే, కొన్నాళ్లకే అప్పటి సీఎం చంద్రబాబు ఏపీ రాజధాని ‘అమరావతి’కి పాలనా యంత్రాంగాన్ని తరలించారు. ఈ ఏడాది మొదట్లో హైకోర్టు విభజన కూడా జరిగింది. హైదరాబాద్‌లోని సచివాలయంలోని కొన్ని బ్లాక్‌లతోపాటు మరికొన్ని భవనాలు మాత్రం ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి. జగన్ సీఎం అయిన తర్వాత ఆ భవనాలను పూర్తిగా తెలంగాణకు అప్పగించారు. ఇక... రెండు రాష్ట్రాల మధ్య మిగిలిన అధికారిక ‘ఉమ్మడి’ బంధం గవర్నర్ వ్యవస్థ మాత్రమే! ఇప్పుడు గవర్నర్‌లు కూడా వేర్వేరు అయ్యారు.
ఉమ్మడి రాజధానిని పదేళ్లు ఉపయోగించుకునే వీలున్నప్పటికీ... ఏపీకి కొత్త గవర్నర్‌ను మాత్రం రాష్ట్రపతి నిర్ణయం మేరకు ఎప్పుడైనా నియమించవచ్చునని విభజన చట్టంలో తెలిపారు. అయితే, ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై చట్టంలో ప్రత్యేకంగా ‘సెక్షన్ 8’ను పొందుపరిచారు. సెక్షన్-1(7) లో ఉమ్మడి గవర్నర్ ప్రస్తావన ఉంది. ఆ తర్వాత సెక్షన్-1 (8)(1)లో రాజధానిలో గవర్నర్ అధికారాలు, బాధ్యతలు ఉన్నాయి. సెక్షన్-8లో ఉమ్మడి రాజఽధానిగా ఉన్నంత కాలం ప్రజల రక్షణ, ఆస్తులను కాపాడే అధికారం గవర్నర్‌కు కేంద్రం దఖలు పరచింది. శాంతిభద్రతల పరిరక్షణ, అంతర్గత భద్రతతో పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ప్రభుత్వ భవనాలను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించడం వంటి బాధ్యతలను గవర్నర్‌కు ఇచ్చారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ మంత్రివర్గం సంప్రదింపులతోనే ముందుకెళ్లాలని చట్టంలో ఉంది. నిజానికి... ఏపీ రాజధాని అమరావతికి తరలి వెళ్లిపోయినప్పుడే సాంకేతికంగా సెక్షన్-8కు కాలం చెల్లినట్లయింది. ఇప్పుడు వేర్వేరు గవర్నర్ల నియామకంతో అది పూర్తిగా రద్దయినట్లే.
