సీఎం నివాసం వద్ద కొనసాగుతున్న ఆందోళనలు

కానిస్టేబుల్ పోస్టులు పెంచాలని కోరుతూ 300 మందికిపైగా అభ్యర్థులు సీఎం నివాసం పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎంను కలిసే వరకు కదిలేది లేదని వారు తేల్చి చెప్పారు.మాజీ ఎసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌కు వ్యతిరేకంగా ఏసీబీ కేసుల బాధితులు సీఎం నివాసం వద్ద ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు మెప్పు కోసం తమపై అక్రమ కేసులు బనాయించారని వారు ఆరోపించారు. తమపై పెట్టిన తప్పుడు కేసులపై సమీక్ష చేయాలని వారంతా కోరుతున్నారు.శ్రీశైలం ప్రాజెక్టులో సర్వం కోల్పోయిన తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ ఔట్‌సోర్సింగ్ లస్కర్లు బ్యానర్లు ప్రదర్శించారు.గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న 500 మందికిపైగా గోపాలమిత్రలు తమకు సీఎంను కలిసే అవకాశం ఇవ్వాలని కోరారు.గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ శాఖ తరపున భర్తీ చేసే ఉద్యోగాలను వ్యవసాయ విద్యను అభ్యసించిన వారితోనే భర్తీ చేయాలని కోరుతూ ఎన్జీరంగా విశ్వవిద్యాలయంలో చదివిన అభ్యర్థులు, వ్యవసాయ ఇంజనీరింగ్‌పాలిటెక్నిక్ నిరుద్యోగుల సంఘానికి చెందిన విద్యార్థులు ఆందోళన చేశారు.రాష్ట్ర విభజన వల్ల ఉద్యోగాలు కోల్పోయిన డిస్టర్బ్ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేశారు.తమను ఔట్ సోర్సింగ్ లేక కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ పశు సంవర్థక శాఖ పరిధిలోని ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ఇంజనీరింగ్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేశారు. గత ఏడు నెలలుగా జీతాలు లేవని, 450 కుటుంబాల వారికి న్యాయం చేయాలని కోరారు.సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీడ్యాప్ సిబ్బంది ఆందోళన చేశారు.పాదయాత్రలో ఇచ్చిన హామీలను నె రవేర్చాలని కోరుతూ గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న సాక్షర భారత్ ఉద్యోగులు మంగళవారం కూడా సీఎం నివాసం వద్ద ఆందోళన కొనసాగించారు.
