Published: 08-07-2019

కంపెనీలు పెట్టలేం.. పలు సంస్థల వెనకడుగు

 ‘పెట్టుబడులు పెట్టేందుకు, కంపెనీలు స్థాపించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ భూమి ధర ఇంతంటే మాత్రం మావల్ల కాదు. ధర తగ్గించి భూమి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే ప్లాంట్లు పెట్టి ఉత్పత్తి చేస్తాం. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని పలు సంస్థలు అంతర్గతంగా పేర్కొంటున్నాయి. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో ఈ పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లా అంటే ఇప్పుడు పరిశ్రమలపరంగా గుర్తొచ్చేది కియ. ఈ కార్ల పరిశ్రమ రాకతో అనంతపురం-బెంగళూరు జాతీయ రహదారిపై సందడి నెలకొంది. అనుబంధ సంస్థల్ని కూడా వెంట తీసుకొచ్చింది. ఆగస్టు మొదటి వారంలో కియ కార్ల వాణిజ్య ఉత్పత్తి కూడా ఇక్కడ ప్రారంభమవుతోంది. ఇది ఈ ప్రాంతంలో మరిన్ని అనుబంధ సంస్థలు వచ్చేలా చేసేందుకు దోహదపడుతోంది. అయితే ఏపీఐఐసీ.. భూమి ధర అధికంగా చెబుతుండడంతో కంపెనీలు ఆగిపోయాయని సమాచారం.
 
 
గత 10 నెలల కాలంగా కొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టి ఇక్కడే ఉత్పత్తి చేస్తాం.. భూమి కేటాయించాలని అడిగాయి. అయితే భూమి విలువ ఎకరాకు సుమారు రూ.60 లక్షలని ఏపీఐఐసీ అనడంతో.. సదరు కంపెనీలు వెనుకంజ వేసినట్లు సమాచారం. ఇలాంటివి సుమారు 10 వరకు ఉన్నాయని అంటున్నారు. ఇలా వస్తానంటున్న సంస్థల్లో చాలావరకు కియ కారుకు అవసరమైన విడిభాగాలు తయారుచేసేవే. లైట్లు, ఇతర విడిభాగాలను తయారుచేసే కంపెనీలు వీటిలో ఉన్నాయి. ఇవి ప్రస్తుతం బెంగళూరు, పుణే తదితర చోట్ల ఉత్పత్తి చేసిన విడిభాగాలను కియ ప్లాంటుకు సరఫరా చేస్తున్నాయి. రాష్ట్రానికి వచ్చేందుకు సిద్దంగా ఉన్నా.. ఏపీఐఐసీ చెప్తున్న భూమి ధర చూసి రావడం లేదు.
 
ఆ ఒక్క కంపెనీతో పెరిగిన రేటు..: వాస్తవానికి కియ పరిశ్రమకు నాటి ప్రభుత్వం తక్కువ ధరకే భూమి కేటాయించింది. రైతుల నుంచి ఎక్కువకు కొనుగోలుచేసి.. ఆ కంపెనీకి మాత్రం రూ.6 లక్షలకే ఇచ్చింది. ఒక భారీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడం కోసం ఈ ప్రోత్సాహకం ఇచ్చారు. ఎర్రమంచి, అమ్మవారిపల్లి తదితర గ్రామాల్లో కియకు, దాని నాలుగు అనుబంధ సంస్థలకు కలిపి 535 ఎకరాలు కేటాయించారు. జాతీయ రహదారికి ఒకవైపు ఈ భూమి ఇవ్వగా...దానికి సరిగ్గా ఎదురుగా దూదేబండ గ్రామంలో మరో ఏడు సంస్థలకు సుమారు 151 ఎకరాల భూమి ఇచ్చారు. ఈ ఏడు కూడా కియకు విడిభాగాలు తయారుచేసేవే. వీటిన్నిటికీ ఎకరా రూ.6 లక్షలకే భూమి కేటాయించారు. ఇవన్నీ అక్కడ ప్లాంట్లు నిర్మించి ఉత్పత్తి ప్రారంభించడంతో కార్యకలాపాలు పెరిగాయి. భూమి ధరా పెరిగింది. పరిశ్రమల నుంచి డిమాండ్‌ కూడా పెరిగింది. ఏడాది క్రితం ఒక కంపెనీ తనకు భూమి కేటాయించాలని.. ఎకరాకు రూ.60 లక్షల చొప్పున ఇస్తామని ప్రతిపాదించింది. సదరు కంపెనీకి ఏపీఐఐసీ స్థలం కేటాయించింది. ఒక కంపెనీకి ఆ ధరకు ఇవ్వడంతో.. ఇక మిగిలిన కంపెనీలకూ అదే ధరకు ఇస్తామంటోంది. అమాంతం రేటు పెంచేయడంతో అవి రానంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో విడిభాగాలను ఉత్పత్తిచేసి కియకు సరఫరా చేసేందుకు సిద్ధమయ్యాయి.