లోకేశ్ కు కీలక బాధ్యతలు

టీడీపీ అధినేత చంద్రబాబు 40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన తనయుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా..ఎమ్మెల్సీ పదవికే పరిమితం అయ్యారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిన తరు వాత పార్టీలో యువరక్తం పెంచాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లోగా లోకేశ్ ను సమర్ధవంతంగా తీర్చి దిద్దాలని భావిస్తున్నారు. ఇందు కోసం లోకేశ్ కు పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వాలని అధినేత ఆలోచనగా తెలుస్తోంది. చంద్రబాబు సన్నిహితులు సైతం అదే సూచిస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయం లోనే అనేక ఆటు పోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని..దీని ద్వారా సహజంగానే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని చెబుతున్నారు. మంత్రిగా పని చేసినా లోకేశ్ కు రాజకీయంగా పూర్తి స్థాయిలో నైపుణ్యత రాలేదు. దీంతో..ఇప్పుడు ప్రతి పక్ష నేతగా చంద్రబాబు అసెంబ్లీలో పాత్రకే పరిమితమై..బయట మాత్రం ఆ పాత్రను పూర్తిగా లోకేశ్ ద్వారా నిర్వహించే ప్రణాళికలు అమలు చేయాలని భావిస్తున్నారు. దీంతో పాటుగా పార్టీలోనూ కీలక పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నారు.ప్రస్తుతం చంద్రబాబు వయసు 69 సంవత్సరాలు. వచ్చే ఎన్నికల నాటిని ఆయన వయసు 74కు చేరుతుంది. దీంతో.. పార్టీ బాధ్యతలు ఇప్పటి నుండే లోకేశ్ కు అప్పగించటం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి మరింత సమర్ధవంతంగా సిద్ద మవుతారని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా విదేశీ పర్యటన నుండి వచ్చిన నాటి నుండి లోకేశ్ అధికార పార్టీ మీద..ముఖ్యంగా సీఎం జగన్ మీద ప్రతీ రోజు ట్విట్టర్ ద్వారా పూర్తి లెక్కలు..సమాచారం తో సహా కార్నర్ చేస్తున్నారు. అయితే, సొంత పార్టీలోనే లోకేశ్ కు ఇస్తున్న ప్రాధాన్యత పైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గతంలో మంత్రిగా ఉండి ..పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే అందరినీ ఒకే రకంగా కాకుండా..దూరం పెట్టారనే భావన కొందరిలో ఉంది. వారి తో ఇప్పుడు చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకొని సాధ్యమైనంత త్వరగా లోకేశ్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరి..దీనికి ముహూర్తం త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉంది.
