Published: 30-06-2019

తాడేపల్లిలోని నివాసం వద్ద వినతులు విననున్న జగన్‌

జనం సమస్యలు నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్‌ సిద్ధమవుతున్నారు. ప్రతి రోజూ ఉదయం గంటసేపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల వినతులు స్వీకరించి అక్కడికక్కడే న్యాయం చేయబోతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం వద్ద జూలై 1నుంచి ప్రజా దర్బార్‌ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తాడేపల్లిలోని జగన్‌ ఇంటికి జనం తాకిడి ఎక్కువైంది. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది తదితర వర్గాలు వ్యక్తిగత సమస్యలతోపాటు స్థానిక సమస్యలు పరిష్కరించాలని అక్కడికి వచ్చి వినతిపత్రాలు ఇస్తున్నారు. వాటిని తీసుకుని శాఖలవారీగా విభజించి పరిష్కరించేందుకు తగిన సిబ్బందిని సీఎం నియమించారు. తన కుటుంబానికి సన్నిహితుడైన అనంతపురం జిల్లాకు చెందిన హరికృష్ణకు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే వచ్చిన వారిలో ఎక్కువమంది తాము ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడాలని అనుకొంటున్నట్లు చెబుతున్నారు. ఈ విషయం జగన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో క్యాంపు కార్యాలయం వద్ద ప్రజా దర్బార్‌కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సీఎం వద్దకు వినతిపత్రాలతో వచ్చే ప్రజలు వేచి చూసేందుకు వీలుగా క్యాంపు కార్యాలయానికి సమీపంలో షెడ్డు నిర్మించి ఫ్యాన్లు ఏర్పాటుచేసి తాగునీటి సౌకర్యం కల్పించారు.
 
 
మరోవైపు సీఎం నివాస పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేసి ఇంటి ముందున్న చిన్న చిన్న నిర్మాణాలను పరిహారం చెల్లించి తొలగించారు. పోలీసు అధికారులు సిబ్బందిని పెంచి వినతులతో వచ్చేవారిని క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భద్రతా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్కానర్లు ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేయడంతో జూలై 1నుంచి ప్రతి రోజూ ఉదయం 8-9మధ్యలో గంటపాటు ప్రజల వినతులు ప్రత్యక్షంగా వినేందుకు జగన్‌ సిద్ధమయ్యారు. సాధ్యమైనంతవరకూ అక్కడికక్కడే పరిష్కారాలను సూచించబోతున్నట్లు సమాచారం.