Published: 20-06-2019
డ్వాక్రా సంఘాల రుణమాఫీకి ప్రభుత్వ కసరత్తు

వైఎస్సార్ భరోసా పథకం ద్వారా డ్వాక్రా సంఘాల రుణాల మాఫీకి రాష్ట్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా వున్న 67,860 పొదుపు గ్రూపుల్లో సభ్యులైన 6,10,740 లక్షలమంది మహిళలు దాదాపు రూ.2,360 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీ వరకు స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి.
నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ భరోసా పథకం ద్వారా డ్వాక్రా రుణాల మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పొదుపు మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. ఏప్రిల్ 11వ తేదీకి ముందు వరకు డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఎంత మొత్తం రుణాలు తీసుకున్నారో వివరాలు సేకరించాలని వెలుగు కార్యాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. దాంతో రుణగ్రహీతల వివరాలను కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు (సీసీలు) సేకరిస్తున్నారు. జిల్లాలో 67,860 పొదుపు గ్రూపులుండగా 6,10,740 లక్షల మంది మహిళలు సభ్యులున్నారు. వీరంతా ఏప్రిల్ 11వ తేదీ ముందు వరకు రూ.2,360 కోట్ల వరకు రుణాలు తీసుకున్నట్లు సమాచారం. తాజా ఆదేశాలతో ఈ మొత్తం మాఫీ అయ్యే అవకాశం ఉంది.
