Published: 17-06-2019
ఏపీ పోలీసులకు వారాంతపు సెలవులు

ఏపీ పోలీసులకు ఎట్టకేలకు వారాంతపు సెలవులు లభించాయి. రాష్ట్రంలోనే పెద్ద నగరమైన విశాఖపట్నంలో మొదలైన వీక్లీ ఆఫ్ విధానాన్ని మరో వారంలో రాష్ట్రమంతా అమలు చేయునున్నారు. పోలీసులకు వీక్లీఆఫ్ ఇవ్వాలని ఈ మేరకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఈ నెల 3న సూచించారు. జూన్ 4న రాష్ట్ర శాంతి భద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో 22మంది వివిధ స్థాయి పోలీసులతో కమిటీ వేశారు. వారం రోజుల్లో వీక్లీ ఆప్ విధివిధానాలకు సంబంధించిన ప్రణాళిక ఇవ్వాలని ఆదేశించారు.
కసరత్తు చేసిన కమిటీ ఈ నెల 12న పోలీస్ బాస్‌కు నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం శాంతి భద్రతల విభాగంలో పనిచేసే వారిలో మార్నింగ్ షిప్ట్, సెక్షన్ డ్యూటీ(8గంటలు) చేసి 36 గంటలు రెస్ట్ తీసుకునేవారి డ్యూటీల్లో ఎలాంటి మార్పు ఉండదు. జనరల్ డ్యూటీలు, వారెంట్లు, బందోబస్తు విధులు నిర్వహించే వారి విధులకు ఆటంకం కలగకుండా ఒక రోజు సర్దుబాటుతో వీక్లీ ఆఫ్ ఇస్తారు. ట్రాఫిక్ విభాగంలో వారమంతా పనిచేసే సిబ్బందిని ఏడు విభాగాలుగా విభజించి ఒక్కో రోజు ఒక్కొక్కరికి చొప్పున సీనియారిటీ ప్రాతిపదికన వీక్లీ ఆఫ్ ఇస్తారు. ఆర్మ్‌డ్ రిజర్వు విభాగంలో గార్డు, సెక్యూరిటీ విధులు నిర్వహించే వారికి సిబ్బంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని పరిస్థితులకు అనుగుణంగా వీక్లీఆఫ్ ఉంటుంది.
అయితే అత్యవసర సమయాల్లో మాత్రం వీక్లీఆఫ్ రద్దు చేసుకుని డ్యూటీకి వస్తామని అంగీకార పత్రం రాసివ్వాల్సి ఉంటుంది. అలా డ్యూటీ చేసినా మరో రోజు వీక్లీ ఆఫ్ తీసుకోవచ్చు. పోలీసు వాహనానికి ఇద్దరి చొప్పున డ్రైవర్లు ఉంటారు గనుక ఇబ్బంది లేకుండా ఇవ్వనున్నారు. ఈ మేరకు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ జిల్లాల్లోని పరిస్థితులకు అనుగుణంగా వీక్లీఆ్‌ఫలు ఆమలు చేయాలని సూచించినట్లు తెలిసింది.
