Published: 07-06-2019

పుకార్లపై వైవీ సుబ్బారెడ్డి రియాక్షన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన బాబాయ్, వైసీపీ కీలకనేత వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్‌ పదవి దాదాపు ఖరారు చేసిన సంగతి తెలిసిందే! ఇక అధికారికంగా ప్రకటన మాత్రమే మిగిలుంది. అయితే వైవీ పేరు ప్రకటించిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా సుబ్బారెడ్డి హిందువు కాదని.. ఆయన క్రిస్టియన్ అని అసలు ఆయనకు టీటీడీ బాధ్యతలు ఎలా అప్పగిస్తారు..? హిందువులకే ఆ పదవి కేటాయించాలి అంతే కానీ క్రిస్టియన్‌లకు ఇస్తే ఎలా..? దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం..? అంటూ కొన్ని వర్గాలు పెద్ద ఎత్తున హడావుడి చేశాయి. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు వైవీ సుబ్బారెడ్డి రియాక్ట్ అయ్యారు. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన క్లారిటీ ఇచ్చేశారు.
 
తాను హిందువు కాదన్న వార్తలు అవాస్తవమని.. కొందరు పనిగట్టుకుని ఇలాంటి పుకార్లు చేస్తున్నారని వాటిని ఎవరూ నమ్మకండని వైవీ సుబ్బారెడ్డి తేల్చిచెప్పారు. తాను హిందువునేనని.. తిరుమల శ్రీనివాసుడు మా ఇష్టదైవం అని వైవీ స్పష్టం చేశారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డి తనకు ఎలాంటి బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానన్నారు. టీటీడీ చైర్మన్‌గా ఉండాలని జగన్ తనను ఆదేశించారని.. దేవుడికి సేవ చేసే భాగ్యం కలిగించిందని అనుకుంటున్నానని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.
 
టీటీడీ చైర్మన్ పదవి రావడం అదృష్టమని.. తనకు శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం దక్కినట్లేనని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. టీటీడీనే కాదు భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా తీసుకుంటానని వైవీ చెప్పారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ముఖ్యంగా స్వామివారి ఆస్తులు, ఆభరణాల అవకతవకలపై వాస్తవాలు రాబడుతామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని జగన్ అమలు చేస్తారని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.