Published: 31-05-2019
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరస్పరం సహకరించుకోవాలి

‘‘తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు చేయాల్సింది ఖడ్గచాలనం కాదు.. కరచాలనం’’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఒక రాష్ట్రం అవసరాలకు మరో రాష్ట్రం ఆత్మీయతతో, అనురాగంతో సహకరించుకొని అద్భుతమైన ఫలితాలు రాబట్టాలన్నారు. జగన్మోహన్ రెడ్డిని నవయువ ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ ఆయనకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతతో ప్రజలు ఆయన్ను గెలిపించారని అన్నారు. ప్రజలు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకొని తండ్రి రాజశేఖర్ రెడ్డి పేరును నిలబెట్టాలన్నారు. తన పాలన ద్వారా చరిత్రలో నిలిచిపోయేవిధంగా కీర్తిప్రతిష్టలు ఆర్జించాలన్నారు. ఏపీ సీఎం జగన్ బాధ్యతలు స్వీకరించడం తెలుగు ప్రజల జీవనగమనంలో ఉజ్వల ఘట్టంగా అభివర్ణించారు. దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ప్రేమ, అనురాగం, పరస్పర సహకారంతో ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. గురువారం ఇక్కడ ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. దాదాపు ఐదు నిమిషాల పాటు మాట్లాడిన ఆయన జగన్ ఈ ఒక్క పర్యాయమే కాకుండా కనీసం మూడు, నాలుగు పర్యాయాలు ఏపీ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
