Published: 26-05-2019
జగన్‌పై హత్యాయత్నం చేయలేదు

‘జగన్‌పై నేను కోడికత్తితో దాడి చేయలేదు. అది ఫ్రూట్ సలాడ్ కత్తి. నా కంగారులో ఆయనకు అప్పుడు ఏమి జరిగిందో కూడా చూడలేదు. కానీ, జగన్ చాలా దయా హృదయుడు. ఆ రోజు నన్ను కొడుతున్నప్పుడు కూడా వాడిని కొట్టొద్దని చెప్పారు. నాకు టీడీపీతో ఎలాంటి సంబంధమూ లేదు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే జగనన్నే కారణం. జగన్‌ను ప్రజలు కావాలని కోరుకున్నారు. ఆయన సీఎం కావడం చాలా సంతోషంగా ఉంది’ అని జగన్‌పై దాడి కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ చెప్పాడు.
శనివారం శ్రీనివాసరావును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి బెయిల్‌పై విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడాడు. ‘నేనొక కుక్‌ని. అది కోడికత్తి కాదు. ఫ్రూట్ సలాడ్ నైఫ్. నా జేబులో అలాంటివి రెండు ఉన్నాయి. కొన్ని సమస్యలను తీసుకుని జగన్ వద్దకు వెళ్లాను. కంగారులో ఆయనకు చిన్నది గీసుకుంది. హత్యాప్రయత్నం చేశానని, దేనికయినా లోబడ్డానని, సింపతీ కోసమని అనుకుంటే నార్కో ఎనాలసిస్ పరీక్షకు నేను సిద్ధం. ఆ రోజు ఎయిర్‌పోర్ట్‌లో దొరికిన వస్తువులు చూడండి. చిన్న నైఫ్, ఫోర్క్ దొరికాయి’ అన్నాడు. జగన్ అభిమానిని కాదంటే శిరచ్ఛేదనం చేయించుకుంటా అని శ్రీనివాస్ ప్రకటించాడు. కాగా.. కేసును రాజకీయంగా తప్పుదోవ పట్టించారని శ్రీనివాసరావు తరపు లాయర్ సలీం అన్నారు. కేసులో సాంకేతికపరమైన లోపాలున్నాయని చెప్పారు. మరోవైపు.. జగన్‌కు శ్రీనివాసరావు వీరాభిమాని అని అతని సోదరుడు సుబ్బరాజు చెప్పారు.
