Published: 08-05-2019
అధికారులు కలవడానికి కోడ్ అడ్డంకి కానేకాదు

ఐఏఎస్ అధికారులను రక్షించడం, పోషించడం, వారు పనిచేసేలా అనుకూల వాతావరణం కల్పించాలనే ఆపేక్ష సీఎంకే ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. సీఎం ఏ సమీక్ష సమావేశానికి పిలిచినా తప్పకుండా హాజరవుతానన్నారు. ఇప్పటి వరకు సీఎం తనను ఒక భేటీకి పిలిచారని, ఆ సమయంలో 15వ ఆర్థిక సంఘం సభ్యుని సమావేశంలో ఉన్నందున హాజరుకాలేకపోయానని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఏ రివ్యూలకూ తనను పిలవలేదని చెప్పారు. మంగళవారం ఎల్వీ సుబ్రమణ్యం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఐఏఎస్‌లతో పని చేయించుకోవాల్సిన బాధ్యత సీఎందేనని... ఆయనకు లేని ఆపేక్ష తనకెలా ఉంటుందని ప్రశ్నించారు. ఇప్పుడు మీపై సీఎంకు ఆపేక్ష ఉన్నట్లు కనిపించడం లేదు కదా అని ప్రశ్నించగా... ‘కొన్నిసార్లు బయటికి కనిపించకపోవచ్చు. తండ్రి ఎప్పుడూ ప్రేమను బయటకి చూపరు’ అని ఎల్వీ సమాధానమిచ్చారు.
పరిపాలనా వ్యవహారాలకు ముఖ్యమంత్రే అధిపతి అని, ఏ విషయంలోనైనా ఆయన నిర్ణయమే ఫైనల్ అని స్పష్టంచేశారు. అధికారులెవరైనా సీఎంని, మంత్రులను కలిసి వారి శాఖల వివరాలు తెలియపరచడానికి కోడ్ అడ్డంకి కాదని తెలిపారు. తుఫాను సమయంలో ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ వరప్రసాద్ సీఎంను కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితులు వివరించారని, దీనిపై సీఎం కొన్ని విలువైన సూచనలు చేశారని తెలిపారు. ఆ సూచనలు సమంజసంగా ఉండడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చానన్నారు. ప్రస్తుతం పరిపాలన సజావుగానే సాగుతోందన్నారు. సీఎం పక్కన సీఎస్ కూర్చుంటేనే పరిపాలన సజావుగా సాగుతుందనుకోవడం సమంజసం కాదన్నారు.
