Published: 07-05-2019
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఇంజనీరింగ్ కాలేజీల ధీమా

ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉందన్న ధీమాతో పలు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు అప్పుడే అడ్మిషన్ల వేట ప్రారంభించాయి. సీట్లు భర్తీచేసుకునేందుకు రకరకాల దారులను వెతుక్కుంటున్నాయి. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై.. ఎంసెట్‌కు హాజరైన విద్యార్థుల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. ఎంసెట్ కౌన్సెలింగ్‌కు ముందునుంచే విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించేందుకు వివిధ ఆఫర్లతో రంగంలోకి దిగాయి. ఎంసెట్ అభ్యర్థుల జాబితాలు, చిరునామాలు పట్టుకుని గ్రామాలకు తమ ప్రతినిధులను పంపుతున్నాయి. ఇందుకోసం కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కన్సల్టెంట్లు, పీఆర్వో వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఒక్క అడ్మిషన్ తీసుకువస్తే చాలు.. రూ.10వేలు ఇస్తామంటూ కన్సల్టెంట్లకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఏఎఫ్‌ఆర్సీ నిర్ధేశిత ఫీజు కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువగా తీసుకోబోమని.. రవాణా చార్జీలు చెల్లించాల్సిన పనిలేదని కొన్ని కాలేజీలు చెబుతుండగా.. ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తే ఫీజు తగ్గిస్తామని, ల్యాప్‌టా్‌పలు ఉచితంగా ఇస్తామని మరికొన్ని కాలేజీలు తాయిలాలు ఎరవేస్తున్నాయి. పల్లెలకు వెళ్లి తల్లిదండ్రులను కలిసి తమ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వివరిస్తున్నాయి. హాస్టల్‌లో చేరితే సగం ఫీజు తగ్గిస్తామని చెబుతున్నాయి.
కన్వీనర్ కోటా కింద ఏ కాలేజీలోనైనా సరే 10వేలలోపు ర్యాంకర్లు చేరితే వారికి సంబంధించిన మొత్తం ఫీజును ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుంది. ఎస్సీ, ఎస్టీలకూ అంతే. మేనేజ్‌మెంట్ కోటాలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండదు. అందుకే ‘రూ.20 వేలు తగ్గిస్తాం, రూ.10వేలు తగ్గిస్తాం’ అంటూ పీఆర్వోలు ఆఫర్లిస్తున్నారు. ఎంత ర్యాంక్ వచ్చినా ఫర్వాలేదు అడ్మిషన్ ఇస్తామని చెబుతుండటంతో, పలువురు ఇది బాగానే ఉందని భావించి సరేనంటున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇస్తే తదుపరి ప్రక్రియ అంతా తామే చూసుకుంటామంటూ వేర్వేరు ప్యాకేజీలతో తల్లిదండ్రులను ఆకర్షించే పనిలో కన్సల్టెంట్లు ఉన్నారు.
ఇంజనీరింగ్ కాలేజీలు తమ గ్రామాలకు బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నప్పటికీ.. ఆ సమయంలో టిఫిన్ చేసి రావడం వీలుకాదని పలువురు కన్సల్టెంట్లతో చెబుతుండగా.. ‘ఆ విషయం మాకు వదిలేయండి. మీకు టిఫిన్స్ కూడా కాలేజీల్లోనే ఏర్పాటు చేయిస్తాం’ అని హామీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు కాలేజీల యాజమాన్యాలు అభ్యర్థుల నుంచి తీసుకున్న సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్లు చేయించినట్లు సమాచారం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎంసెట్-ఇంజనీరింగ్ విభాగంలో క్వాలిఫైడ్ అభ్యర్థులు తగ్గితే.. ఆ ప్రభావం అడ్మిషన్లపై ఉంటుందన్న భయం కాలేజీల యాజమాన్యాల్లో కనిపిస్తోంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నాయి. రాష్ట్రంలో 300లకు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా, వాటిల్లో ప్రతిష్ఠ కలిగిన 20-30 కాలేజీలు మినహా మరే కాలేజీలో డొనేషన్ వసూలు చేసే పరిస్థితి లేదు. అది కూడా కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ తదితర బ్రాంచ్‌లకు మాత్రమే డిమాండ్ కనిపిస్తోంది.
విశ్వవిద్యాలయ కాలేజీల్లో అన్ని బ్రాంచ్‌లకు డిమాండ్ ఉండగా.. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు ఒకే ఫీజు ఉన్నందున.. రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ కాలేజీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ట్యూషన్ ఫీజును నాలుగేళ్లకు కలిపి లెక్కించి రాయితీలు ఇస్తామని అడ్మిషన్‌ను ధృవీకరించుకుంటున్నాయి. గతేడాది కంటే అడ్మిషన్లు తగ్గకుండా జాగ్రత్త పడుతూ.. ఎంసెట్‌లో ఎంత ర్యాంక్ వచ్చినా ఫర్వాలేదు.. అడ్మిషన్ తీసుకుంటే అదే చాలన్న ధోరణి యాజమాన్యాల్లో కనిపిస్తోంది. తొలుత అడ్మిషన్ల ప్రక్రియ ముగిస్తే.. ఆ తర్వాత ఎలాగూ ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుందన్న ధీమాతో ఉన్నాయి.
