Published: 25-04-2019
ఆస్పత్రుల్లో మందుల్లేవ్.. రాబిస్ వ్యాక్సిన్ కొరత

కుక్క కాటు చెప్పు దెబ్బ అనేది సామెత. ప్రస్తుతం రాష్ట్రంలో అదే నిజం అవుతోంది. ఎవరికి కుక్క కరిచినా చెప్పుదెబ్బతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఆసుపత్రిలోనూ కుక్క కాటుకు మందు దొరకడం లేదు. ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్న బాధితులను వైద్యులు మందులు లేవని తిప్పిపంపిస్తున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి వేల రూపాయిలతో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. సాధారణంగా కుక్క కరిచిన వెంటనే ప్రభుత్వాస్పత్రులకు వెళ్తే అక్కడ వైద్యులు యాంటి రాబిస్ వ్యాక్సిన్ అందిస్తారు.
వ్యాక్సిన్ వేయకుండా ఎలాంటి వైద్యం అందించినా ఉపయోగం ఉండదు. వ్యాక్సిన్ వేయకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి, ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉంది. చిన్న చిన్న ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్‌లో కూడా అందుబాటులో ఉండే యాంటి రాబిస్ వ్యాక్సిన్ ప్రభుత్వాస్పత్రుల్లో మాత్రం అందుబాటు లేదు. బోధనాస్పత్రుల దగ్గర నుంచి పీహెచ్‌సీల వరకూ ఎక్కడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏడాది నుంచే ఈ పరిస్థితి ఉంది. కొరతను భర్తీ చేయడంలో ఆరోగ్యశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. 2నెలల నుంచి పరిస్థితి దారుణంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీడీఎస్ (సెంట్రల్ డ్రగ్ స్టోర్స్)లో ఒక్క వ్యాక్సిన్ కూడా లేదు. దీంతో వైద్యులు కుక్క కాటు బాధితులు వస్తే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
