Published: 18-04-2019
కొత్త ఉద్యోగాల వెతుకులాటలో యువత

ఎటు చూసినా కోలాహలం.. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు దీటుగా ప్రతివ్యూహాలు.. ఎత్తులను చిత్తు చేస్తూ సోషల్‌మీడియా వేదికగా పోస్టింగ్‌లు.. ఎన్నికల ముందు వరకూ రాజకీయ పార్టీల ఐటీ సెంటర్లలో ఉద్యోగుల హడావుడి ఇది. ఎన్నికలు ఇలా ముగిశాయో..లేదో.. ఆయా పార్టీల ఐటీ సెంటర్లు మూగబోయాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కష్టాలు మొదలయ్యాయి. ఖర్చుకు భయపడి చాలా పార్టీలు సిబ్బందికి ఉద్వాసన పలుకుతుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా ప్రచారం, అధికారిక సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ కోసం పలు రాజకీయ పార్టీలు భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకున్నాయి. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఐటీ సెంటర్లను అట్టహాసంగా ప్రారంభించాయి. స్థాయి, పనితనం ఆధారంగా సిబ్బందికి భారీగా వేతనాలు ఇచ్చాయి. అయితే, ఎన్నికలు ముగియడంతో ఐటీ సెంటర్లలోని సిబ్బందికి అన్ని పార్టీలు ఉద్వాసన పలుకుతున్నాయి. సగానికి సగం మందిని విధుల నుంచి తొలగించేస్తున్నాయి. దీంతో అర్ధంతరంగా పని కోల్పోయిన వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు ప్రత్యేకంగా ఐటీ సెంటర్ లేదు. పార్టీ సానుభూతిపరులు, ఆసక్తి కలిగిన నాయకులే సోషల్‌మీడియా బాధ్యతలు చూసుకుంటున్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో హైదరాబాద్ కేంద్రంగా వంద మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారిలో దాదాపుగా అందరూ స్వచ్ఛందంగా పని చేయడానికి వచ్చిన వాళ్లే. లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం తమకే ఓటేయాలని కోరేందుకు పలువురు అభ్యర్థులు వివిధ ఏజెన్సీల తరఫున టెలీకాలర్లను నియమించుకున్నారు. ఇందుకోసం ఆయా ఏజెన్సీలు టెలీకాలర్లు, ఫొటోషాప్ డిజైనర్లను నియమించుకున్నాయి. ఎన్నికలు ముగియడంతో ఆయా ఏజెన్సీలు కొందరిని తొలగించి, మిగిలిన వాళ్లను ఇతర పనుల కోసం ఉపయోగించుకుంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఐటీ విభాగం ఉంది. పార్టీకి చెందిన నాయకులే ఈ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. తమ పార్టీ కార్యకర్తలతోనే దీన్ని నడిపిస్తున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో పలువురు తమ ప్రచారం కోసం వ్యక్తిగతంగా ఫేస్‌బుక్, వాట్సా్‌పల్లో సోషల్ ఆర్మీ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో వలంటీర్లుగా చేరిన వాళ్లకు ఆన్‌లైన్ గిఫ్టు ఓచర్లను అందజేశారు. తద్వారా సోషల్‌మీడియాలో తమకు అనుకూలంగా వారితో ప్రచారం చేయించుకున్నారు. సోషల్ ఆర్మీల్లో వలంటీర్లుగా స్థానిక యువకులు, పార్టీ కార్యకర్తలనే ఎక్కువగా ఉపయోగించుకున్నారు.
