Published: 18-04-2019
రూట్‌మ్యా్‌పల్లోనూ ఇంతటి నిర్లక్ష్యమా?

రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు... పోలింగ్ కేంద్రాల్లో తలెత్తిన ఇబ్బందులపై తక్షణం నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం సాయంత్రం మీడియాకు ఆయన ఈ విషయం తెలిపారు. పోలింగ్ రోజు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘటనలపై ద్వివేది.. కలెక్టర్లను వివరణ కోరారు. ఈవీఎంలు మొరాయించిన ఘటనలతో పాటు ఏయే పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటిదాకా పోలింగ్ కొనసాగించారన్న అంశాలు, వాటికి దారితీసిన కారణాలేమిటి, బాధ్యులు ఎవరన్న దానిపై తక్షణమే నివేదిక పంపాలని కలెక్టర్లకు సూచించారు. నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున భారత్ ఎలక్ర్టానిక్స్ లిమిటెడ్, ఈసీఐఎల్ నిపుణుల్ని కేటాయించినా, వారి సేవలను వాడకపోవడంపైనా కొందరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో రూట్‌మ్యా్‌పలు కూడా సాంకేతిక నిపుణులకు ఇవ్వకపోవడాన్ని గుర్తించామని.. ఎన్నికలకు నాలుగు రోజుల ముందే రాష్ట్రానికి 600 మంది భెల్ ఇంజనీర్లు వచ్చినా కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత పోలింగ్ జరగడానికి గల కారణాలు రాతపూర్వకంగా వివరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పులు చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేస్తామని హెచ్చరించారు.
శ్రీకాకుళం జిల్లా రాజాంలో మైనర్లు ఓటువేసిన ఘటనపై బాఽధ్యులను గుర్తించాలని ఆ జిల్లా కలెక్టర్ నివా్‌సను ద్వివేది ఆదేశించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన 12 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీకి సిఫారసు చేసినట్టు ఆయన మీడియాకు తెలిపారు. ఇందులో నెల్లూరు జిల్లాలో ఆరు, కృష్ణా జిల్లాలో నలుగురు, మండపేటలో ఇద్దరు అధికారులు ఉన్నారని చెప్పారు. ఈ 12 మంది అధికారుల్లో ఆర్‌వోలు, ఏఆర్‌వోలు ఉన్నారని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలోని మూడు పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు స్ర్టాంగ్‌రూమ్‌కి ఆలస్యంగా వెళ్లిన ఘటన అవాస్తవమని కృష్ణా కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారని ద్వివేది చెప్పారు.
