Published: 17-04-2019

గట్టు ఎక్కేదాకా ఓటు మల్లన్న.. ఆ తరువాత బోడి మల్లన్న

 ఎన్నికలంటే డబ్బు, మద్యం, మందు మామూలే. అయితే సాధారణంగా ఓటింగ్‌కు ముందే ఈ ముచ్చట తీరిపోతుంది. గట్టు ఎక్కేదాకా ఓటు మల్లన్న.. ఆ తరువాత బోడి మల్లన్న అనేది నానుడి. ఈ విషయం ఓటర్లకు కూడా బాగా అర్థమయిపోవడం వల్లనో ఏమో కొందరు అభ్యర్థులు కొత్త దారుల్లో ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఓటు వేయించుకొనేవరకు ప్రలోభాలు పెట్టడం అనే సంప్రదాయ పద్ధతిని తిరగరాసి...అంతకు మించి ముందుకెళ్లారు. ఓటేశాక..నేను గెలిచాక కూడా ఫలానాది చేస్తానంటూ హామీ ఇచ్చారు. అంతేకాదు...హామీపై నమ్మకం కలిగించేందుకు చేయాల్సిందీ చేశారు. రాష్ట్రంలో నాలుగైదు స్థానాల్లో ఈ మేరకు వినూత్న ఆలోచనలను అభ్యర్థులు అమలుచేశారని సమాచారం. ఈ ఎన్నికల్లో మాత్రమే కనిపించిన ఇలాంటి ఎత్తులు ఆసక్తి కలిగిస్తున్నాయి. కడప జిల్లాలో ఒక రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి ఈసారి కొత్తగా ఆలోచించారు. ప్రత్యర్థి పార్టీతో సమానంగానే ఈయనా పంచేశారు. వాళ్లెంత ఇస్తే అంతా ఇచ్చారు. అయితే ఆ పంపకంతోపాటు ఒక కూపన్‌ను అదనంగా ఇచ్చారు. ఆ కూపన్‌ విలువ సుమారు వెయ్యి రూపాయలు. తనను గెలిపిస్తే...ఈ కూపన్‌ విలువకు సమానమైన సరుకులను కొనుగోలు చేసుకోవచ్చని ముందే చెప్పారు. పోలింగ్‌ అయిపోయాక ఇటీవల ఆ నియోజకవర్గంలో 20మంది విద్యార్థుల బృందం సర్వే చేసింది. గెలుపోటములపై ప్రజలను అడిగి తెలుసుకుంది. ఆ కూపన్ల అభ్యర్థి అనూహ్య విజయం సాధించినా ఆశ్చర్యం లేదని ఆ సర్వేలో తేలిందట!