Published: 16-04-2019

జగన్ నేమ్ ప్లేట్ హల్ చల్

ముఖ్యమంత్రి పదవిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఎంత ఆశపెట్టుకున్నారో ఆయన మాటల్లో తరచూ బయటపడుతూనే ఉంటుంది. సీఎం కావడమే తన లక్ష్యమని జాతీయ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు కూడా. కానీ ఎన్నికల పోలింగ్ ముగియగానే ఆ పార్టీ నేతలు ఇక జగన్ ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి అన్నట్లుగా హడావుడి చేస్తున్నారు. ‘తొందరపడి ఓ కోయిల ముందే కూసింది’ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.
 
గత రెండు, మూడు రోజులుగా ఏపీలో సోషల్ మీడియాలో అత్యధికంగా ట్రోల్ అయిన ఫోటో ఇది. జగన్ సీఎం అయిపోయినట్లేనని.. ఏకంగా నేమ్ ప్లేట్ తయారు చేశారు. ఇంకా ఫలితాలు రాలేదు కాబట్టి సింబాలిక్‌గా సగం మాత్రమే చూపిస్తూ మిగతా సగం ఫలితాల తర్వాత అన్నట్లుగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వదిలారు. ఇలా ఆ ఫోటో బయటకు వచ్చిందో లేదో.. అలా వైరల్ అయిపోయింది. అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్నవాళ్లకన్నా.. ట్రోల్ చేసినవాళ్లే ఎక్కువ. ఆత్రం ఆగడంలేదన్న కామెంట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.