Published: 12-04-2019

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇదే చర్చ...

ఆంధ్రప్రదేశ్‌లో చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. గంటలకొద్దీ క్యూలైన్లలో నిలబడి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండుటెండలను సయితం లెక్క చేయకుండా పోటింగ్ బూత్‌ల బాట పట్టారు. ఈ పరిణామం దేనికి సంకేతం? ఈ తీర్పు ఎటువైపు మొగ్గు చూపబోతోంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి అంటే 6 గంటల వరకు మొత్తం 75 శాతం వరకు పోలింగ్ నమోదయింది. క్యూలైన్లలో ఉన్నవారు ఓటేసిన తర్వాత ఓటింగ్ 80 శాతం దాటవచ్చని ఈసీ అంచనా వేసింది. ద్వివేది స్వయంగా ఈ విషయం చెప్పారు. ఏపీ భవిష్యత్తుకు ఎవరు అవసరమో ఓటరు తన నిర్ణయాన్ని ఓటు ద్వారా తెలిపారు.
 
సహజంగానే బలమైన సెంటిమెంట్ కలిగిన ఏపీ వాసులు తమ భవిష్యత్తుకు ఓటేశామని బహిరంగంగా చెప్పారు. క్యూలైన్లలో గంటలతరబడి నిలుచొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటు వేయనివాళ్లు సాయంత్రం తిరిగి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పలు పోలింగ్ కేంద్రాల్లో వందల సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. రాత్రి 8 గంటలు దాటినా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేస్తునే ఉన్నారు. ఈ పరిణామాలు ఓటరు చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి.