Published: 31-03-2019
తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చల అనంతరం పార్టీలో క్రియాశీలంగా మెలగాలని నిర్ణయించారు. బిజ్జం బనగానపల్లెకు ఆదివారం చేరుకుని విలేఖరుల సమావేశం నిర్వహించ నున్నారు. బిజ్జం స్వగ్రామం అవుకు మండలం చెన్నంపల్లె. 1999లో పాణ్యం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డిపై 21,246 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2004 ఎన్నికల్లో రెండోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేతిలో 4592 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్సార్ సమక్షంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బిజ్జం పార్థసారథిరెడ్డి రాజీ అయ్యారు. ఆ తరువాత 15 ఏళ్లుగా బిజ్జం రాజకీయాలకు దూరంగా హైదరాబాదులో వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీసీ జనార్దన్‌రెడ్డికి పరోక్షంగా సహకరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బిజ్జం పార్థసారథిరెడ్డి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో సీఎం ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నాలని కోరినట్లు బిజ్జం పార్థసారథిరెడ్డి శనివారం తెలిపారు. తనకు పట్టున్న బనగానపల్లె, పాణ్యం, డోన్, నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని సీఎం కోరినట్లు బిజ్జం తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల విజయం కోసం పాటు పడుతామని బిజ్జం తెలిపారు. బనగానపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఆదివారం రానున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డితో కలిసి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అనంతరం ప్రచారం చేసే గ్రామాలపై చర్చించనున్నట్లు తెలిపారు.
