Published: 31-03-2019
కోడి కత్తి నుంచి అదే వరుస

గత కొన్న రోజులుగా చోటుచేసుకుంటున్న సంఘటనలను గమనిస్తున్న ప్రజలు ‘అమ్మో వైసీపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటి’ అని భయపడుతున్నారు. కులాభిమానం, మతాభిమానంతో పాటు రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నవారు మినహా... మిగతా వర్గాల ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ కో పట్ల భయాలు ఏర్పడ్డాయి. సోషల్ మీడియాలో జగన్ అనుచరులు పెడుతున్న పోస్టింగులే ఇందుకు నిదర్శనం. ‘ఏబీఎన్–ఆంధ్రజ్యోతి టీమ్‌ను అంతమొందించడానికి మరో మొద్దు శీను అవసరం’ వంటి పోస్టింగులు పెడుతున్నారంటే వైసీపీ అభిమానుల మానసిక స్థితి ఏ స్థాయికి చేరిందో ఊహించుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కుట్రలకు, కుతంత్రాలకు నిలయంగా మారుతున్నాయా? ఎన్నికలు సమీపించిన నాటి నుంచీ నేటి వరకు జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తే అవుననే సమాధానమే లభిస్తోంది. అధికార పార్టీపై ప్రతిపక్షంలో ఉన్నవారు ఆరోపణలు, విమర్శలు చేయడం సహజం. అయితే ఏపీలో ప్రతిపక్షం ధోరణి శ్రుతి మించుతోంది. విపరీత పోకడలు ప్రదర్శిస్తోంది. గడచిన కొంత కాలంగా వైసీపీ అనుసరిస్తున్న వ్యవహార శైలితో ఆ పార్టీపై ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. అధికారంలోకి వచ్చేశామన్న అతి విశ్వాసంతో ఉన్న వైసీపీ నాయకులు హద్దులు దాటి చేస్తున్న విమర్శలు, తెర వెనుక నుంచి చేస్తున్న కుట్రల వల్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. అధికారంలోకి రాక ముందే ఇలా తెగబడుతున్నవారు ఒకవేళ నిజంగానే అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటా అని తటస్థులు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఎలాగైనా అధికారం గుంజుకోవాలన్న తాపత్రయంతో వైసీపీ నాయకులు అటు భారతీయ జనతా పార్టీ, ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులతో చేతులు కలపడంపై ప్రజల్లో చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి కావడం నా కల అని లోపల ఏమీ దాచుకోకుండా చెబుతున్న జగన్మోహన్‌రెడ్డి అందుకోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడబోరన్న అనుమానాలు ప్రజల్లో ఏర్పడుతున్నాయి. రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ తనను ముఖ్యమంత్రిని చేస్తే 1,500 కోట్ల రూపాయలను ఇస్తానని జగన్మోహన్ రెడ్డి తనతోనే చెప్పారని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చెప్పిన మాటలను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఫరూక్ అబ్దుల్లా అల్లాటప్పా నాయకుడేమీ కాదు. కనుక, ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోకుండా ఉండలేం. వందల కోట్ల రూపాయలు వెచ్చించి పదవి కొనుక్కోవాలనుకున్న వ్యక్తి నిజంగా అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారోనని ప్రజలు ఆలోచించుకోవాలి. తన కలను నెరవేర్చుకోవాలన్న ఆరాటంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న పోకడలను ఏపీ ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు.
