Published: 30-03-2019
పోలీస్ చరిత్రలో తొలిసారి 3,500 మందికి ఒకేసారి హెడ్, ఏఎ్‌సఐగా హోదా

ఒక్కటి.. ఒక్కటంటే ఒక్క స్టార్! ఆ స్టార్ భుజంపై మెరుస్తుండగా సర్వీసును పూర్తి చేసుకోవాలనేది పోలీసు కల! ఎప్పటికీ కనిపించని నాలుగో సింహం లాంటి డ్యూటీ తనది! దానిని తమ ‘విధి’గా అనుకోరు. విధి నిర్వహణలో భాగంగానే చూస్తారు. బయట నుంచి మెప్పులు అందకపోయినా పట్టించుకోరు. వారు కోరేదల్లా సొంత డిపార్టుమెంటులో కాస్తంత గుర్తింపు. వంటి మీది ఖాకీకి కొంత మెరుపు. ఒక స్టార్ హోదా. కనీసం హెడ్ అనిపించుకొని పదవీ విరమణ. ఈ మాత్రం భాగ్యానికీ నోచుకోకుండానే కొన్ని తరాలు వెళ్లిపోయాయి. గత ఏడాది పోలీసు శాఖలో చోటు చేసుకున్న పెను విప్లవం ఈ చరిత్రను తిరగరాసింది. ఒక్కసారి పోలీసు ఉద్యోగంలో చేరితే ఆ జీవితం ఇక అంతేననే భావనను మార్చివేసింది.
అతికొద్ది మంది తప్ప హెడ్ కానిస్టేబుల్ అనిపించుకుని శేష జీవితంలోకి వెళ్లాలనే ఎక్కువమంది ఆశ అడియాశలయ్యే పరిస్థితి మారి, ఆ అదృష్టం ఇప్పుడు అందరికీ అందింది. పోలీసు సంక్షేమానికి నవ్యాంధ్రలో కొత్త బాటలు పడిన ఫలితం ఇది. ప్రతి ఒక్కరికీ పదోన్నతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నిర్ణయం తీసుకొంది. పోలీసు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్‌గానే కాదు, భుజంపై స్టార్‌తో ఏఎ్‌సఐగానూ, చివరికి ఎస్‌ఐ హోదాలోనూ పదవీ విరమణ చెందేలా కొత్త పోస్టులను సృష్టించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ పదోన్నతి కల్పించింది. సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ విభాగాలతోపాటు మహిళా పోలీసులకు సైతం ప్రమోషన్ వచ్చింది. ఒక్క ఏడాదిలోనే 3,500 మందికి వివిధ హోదాల్లో పదోన్నతులు లభించాయి. అంతేకాదు, అసలు పరిగణనలోనే లేని మహిళలకు సైతం తొలిసారి పదోన్నతులు దక్కాయి.
పోలీసుశాఖలో అట్టడుగు స్థాయిలో గొడ్డు చాకిరీ చేసే సేవకులు ఎవరంటే టక్కున గుర్తొచ్చేది హోంగార్డులే. రాష్ట్ర విభజన నాటికి ఒక రోజుకు వారికి అందుతున్న వేతనం 300 రూపాయలు. 16వేలమంది దాకా ఉన్న ఇలాంటి సేవకుల వేతన స్థితి గడిచిన నాలుగేళ్లలో బాగా మెరుగుపడింది. ఇప్పుడు ఒక్కో హోంగార్డు నెలకు రూ.18వేలు తీసుకొంటున్నారు. రెండు వారాంతపు సెలవులు గడుపుతున్నారు. మహిళా హోంగార్డులకు రెండు సార్లు ప్రసూతి సెలవులు లభిస్తున్నాయి. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, చంద్రన్న బీమా తదితర సౌకర్యాలు వారికీ కల్పించారు. పాతికేళ్లకు పైబడిన సర్వీసులో ఒక్క పదోన్నతి కూడా దక్కని ఎక్సైజ్ శాఖలోని కానిస్టేబుళ్లలో 275మందికి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించింది. అలాగే, రాష్ట్రంలోని 172 ఫైర్ స్టేషన్ల పరిధిలోని 204 మందికి లీడింగ్ ఫైర్‌మెన్లుగా పదోన్నతికి లైన్ క్లియరైంది. కోడ్ కారణంగా ఈ నిర్ణయం ఇంకా అమల్లోకి రాలేదు.
ఒకప్పుడు పోలీసు కానిస్టేబుళ్లంటే మోకాళ్లదాకా నిక్కర్లు వేసుకుని తిరిగేవారు. తెలుగుజాతి ఆత్మగౌరవం పేరుతో పార్టీ స్థాపించి అనతికాలంలోనే ముఖ్యమంత్రి అయిన ఎన్టీఆర్.. పోలీసులకు కూడా ప్యాంట్లు ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి ఇన్నేళ్లకు కానిస్టేబుళ్ల ఉద్యోగ జీవితాల్లో ఒక మెట్టు ముందుకు పడింది. వారి పదోన్నతి అవకాశాలను నవ్యాంధ్ర ప్రభుత్వం మెరుగుపరిచింది. ఒక్క ఏడాదిలోనే 3,500 మందికి పదోన్నతి కల్పించింది.
‘‘హెడ్ కానిస్టేబుల్‌గానే సర్వీసంతా పని చేయాల్సి వస్తుందని అనుకొన్నాను. పైగా మహిళను కూడా కావడంతో, డిపార్టుమెంటులో ఎదగడం సాధ్యమేనా అనిపించేది. అలాంటిది నాకు, నాలాంటి వందలాది మందికి పదోన్నతి కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒక్కసారే ఇంతమందికి పదోన్నతి కల్పించిన దాఖలా లేదు. అందులోనూ పోలీసు శాఖలోని కిందిస్థాయి సిబ్బందిని పట్టించుకొన్నవారే లేరు. కానిస్టేబుల్ స్థాయిలో పదోన్నతి కల్పిస్తే, వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. లేదంటే నిర్లిప్తత అలుముకొని సరిగ్గా పనిచేయలేరు. కిందిస్థాయి సిబ్బంది హోదాను పెంచడం వల్ల కుటుంబంలోనూ, సమాజంలోనూ వారికి గౌరవం పెరుగుతుంది. పదోన్నతి లాగే, సిబ్బంది సంఖ్యనూ పెంచితే మరింత బాగుంటుంది’’
