Published: 28-03-2019
మోదీ, కేసీఆర్‌తో జగన్ జతకట్టారు

మోదీ, కేసీఆర్‌తో జగన్ జతకట్టారు. వారితో రహస్య ఒప్పందం చేసుకున్నారు. ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారు. ప్రజలకు మాత్రం కల్లబొల్లి మాటలు చెప్పి మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. డొంకతిరుగుడు.. దొడ్డి దారెందుకు.. ఇప్పటికైనా బీజేపీ, టీఆర్‌ఎస్, వైసీపీ ఒక్కటేనని చెప్పి ప్రజల్లోకి రా..’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ అధినేత జగన్‌కు సవాల్ విసిరారు. బుధవారం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, మార్కాపురం, దర్శి, ఒంగోలుల్లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఆయన మాట్లాడుతూ.. జగన్ తనపై ఉన్న కేసుల మాఫీ కోసం అర్ధరాత్రి ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌షా కాళ్ల మీద పడుతున్నారని ఘాటైన విమర్శలు చేశారు.
తనను ముఖ్యమంత్రిని చేస్తే రూ.1500 కోట్లు ఇస్తానన్నాడని ఫరూఖ్ అబ్దుల్లా.. అల్లా సాక్షిగా చెబుతున్నారంటే జగన్ మనస్తత్వం ఎలాంటిదో అర్థమవుతుందన్నారు. ఏడాదిన్నర జైలులో ఉండివచ్చిన జగన్‌కు నైతిక విలువలు ఎక్కడున్నాయని పవన్ ప్రశ్నించారు. ఏలూరులో బీసీల సభ పెట్టిన ఆయన ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చారో చెప్పాలన్నారు. ‘నా పేరు కూడా పలికేందుకు కూడా జగన్‌కు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన సీఎం కొడుకు, నేను పోలీసు బిడ్డను. నన్ను ఆయన నువ్వు, ఒరేయ్, తురేయ్ అనడమే కాకుండా ఇటీవల యాక్టర్, యాక్టర్ పాట్నర్ అంటున్నాడు. నేను నటనను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాను.
మరి ఏడాదిన్నర జైల్లో గడిపి వచ్చిన నిన్ను ఏమనాలి. నువ్వేమైనా స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్లిన గాంధీవా’ అంటూ ప్రశ్నించారు. అసలు అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ సీఎం ఎలా అవుతాడని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత అంటే సమస్యలపై పోరాడాలని చెప్పారు. జగన్‌కు ముస్లింలంటే బానిసలని, వారిని మనుషులుగా కూడా చూడరని అన్నారు. రాయలసీమకెళ్లి చూస్తే ముస్లింలు ఏరకంగా నలిగిపోతున్నారో అర్థమవుతుందన్నారు. రాజమండ్రిలో సిరాజ్ అనే వ్యక్తి జనసేన సభలో మాట్లాడితే అతన్ని వైసీపీ బెదిరిస్తుస్తోందని, ముస్లింల జోలికొస్తే ఊరుకోనని పవన్ హెచ్చరించారు. ఒంగోలులో బాలినేనిని కాదని ఒక ముస్లింకు అవకాశం ఇవ్వగలవా? అని ప్రశ్నించారు. జనసేన ఒక సాధారణ ముస్లిం యువకుడిని పోటీకి పెట్టిందన్నారు.
