Published: 27-03-2019
జగన్ వ్యాఖ్యల దుమారం..

:తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతిస్తే తప్పేంటి? అని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఆ పార్టీ అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తే తప్పేంటి? అని జగన్ తన ప్రత్యర్థి టీడీపీని ప్రశ్నించినా.. టీఆర్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి వ్యతిరేకమని, తెలంగాణ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ ముఖ్యనాయకుడు హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కేసీఆర్ మన హోదాకు మద్దతిస్తానన్నారని జగన్ చెప్తున్న మాటలు.. హరీష్‌రావు వ్యాఖ్యలతో అబద్దమని తేలిపోవడంతో జిల్లాలో వైసీపీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఆపాలని, అమరావతికి పెట్టుబడులురాకుండా నిలువరించాలని కేసీఆర్ అండ్ కో విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ జనం కేసీఆర్‌పై ఆగ్రహంగా ఉన్నారు.
ఈ సమయంలో కేసీఆర్ మద్దతిస్తే తప్పేంటి? అని జగన్ నిర్భయంగా చేసిన వ్యాఖ్యలు వైసీపీకి తీవ్ర నష్టాన్ని తెస్తాయని ఆ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. గతంలో తూర్పుగోదావరి జిల్లాలోనే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేనని తేల్చి జగన్ చెప్పినప్పుడు ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఆందోళన చెందారు. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృత్తమవుతుందని వైసీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. వైసీపీకి ఓట్లేస్తే పెత్తనమంతా కేసీఆర్ చేతికి వెళుతుందని సీఎం చంద్రబాబు చేస్తున్న విమర్శలకు తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయని ఆ పార్టీ నేత అభిప్రాయపడ్డారు. ఏపీ హోదాకు కేసీఆర్ ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని, పైగా మద్దతు ఇస్తానన్న వారిపై తీవ్రమైన విమర్శలు చేశారని వైసీపీ కేడర్‌లోనే చర్చ సాగుతోంది.
‘పోలవరం ప్రాజెక్టు ఇపుడున్న డిజైన్‌ను మేం వ్యతిరేకిస్తున్నాం’ అని టీఆర్‌ఎస్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అలాగే ‘ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే పటాన్‌చెరువులో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రాకుపోతాయ్. ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్టరీలకు పన్ను మినహాయింపు ఇస్తూ.. ప్రత్యేక హోదా ఇస్తే.. తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు..’ అని హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న సమయంలో జగన్ కేసీఆర్‌ని వెనకేసుకొస్తూ చేసిన వ్యాఖ్యలు వైసీపీకి తీవ్ర నష్టాన్ని తెస్తాయని ఆ పార్టీ అభ్యర్థులు, కేడర్ కలత చెందుతున్నారు. ఇప్పటికే వివేకానందరెడ్డి హత్యోదంతంపై తూర్పుగోదావరి వంటి శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రాంతాల్లో వైసీపీ పట్ల ఆందోళన చెందుతున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యల దుమారం వైసీపీ నేతలు, ఎన్నికల బరిలో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది
