Published: 24-03-2019
వైసీపీకి అద్దె కార్యకర్తల సెగ

ఆదిలోనే హంసపాదు.. అడుగ డుగునా భంగపాటు.. అభ్యర్థిత్వం మొదలు నామినేషన్ వరకు వరుస వైఫల్యాలు పశ్చిమ వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. కార్పొరేటర్ బీ జాన్‌బీని నమ్ముకుని నామినేషన్ బాధ్యతను అప్పగించిన వెలంపల్లికి అవమానభారం తప్పలేదు. వెలంపల్లి నామినేషన్ సందర్భంగా శుక్రవారం 36వ డివిజన్ మహిళా కార్పొరేటర్ బీజాన్‌బీ, భర్త గౌస్‌మొహిద్దీన్ పాత రాజరాజేశ్వరిపేట నుంచి సుమారు 300 మందికి పైగా కూలీలను పూటకు రూ.వెయ్యి చొప్పున పోగుచేశారు.
ఈ మేరకు అద్దె కార్యకర్తలు మండుటెండలో వెలంపల్లికి జేజేలు కొడుతూ నినాదాలు చేశారు. అయితే సాయంత్రం సొమ్ములిచ్చే సమయానికి తమకేం సంబంధం లేదంటూ కార్పొరేటర్ భర్త చేతులెత్తేశారు. దీంతో అద్దె కార్యకర్తలు కార్పొరేటర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగడంతో గౌస్‌మొహిద్దీన్ అక్కడి నుంచి పరారయ్యారు. అర్ధరాత్రి వరకు కూలీలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. చివరకు వెలంపల్లి అనుచరులు రంగంలోకి దిగినా వారికి నిరాశే మిగిలింది.
అద్దె కార్యకర్తలు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న వెలంపల్లి అను చరులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూలీలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా చాలాసేపు సమస్య సద్దుమణగలేదు. గౌస్‌మొహిద్దీన్‌తో మాట్లాడి డబ్బులు సర్దుబాటు చేస్తామని చెప్పినా వారు వినలేదు. దీంతో వెలంపల్లికి వ్యక్తిగత అనుచరుడైన ఒకరు రెండు రోజల్లో తానే డబ్బు ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో వైసీపీ నాయకులను తిట్టుకుంటూ ఆ అద్దె కార్మికులు ఇంటి ముఖం పట్టారు.
