Published: 20-03-2019
బడికొస్తా’ సైకిళ్లకు ‘కోడ్’ వర్తించదు

‘బడికొస్తా’ పథకం కింద 8,9 తరగతులు చదువుతున్న బాలికలకు పంపిణీ చేస్తున్న సైకిళ్లకు ఎన్నికల కోడ్ వర్తించదని పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పథకం 2016-17 విద్యా సంవత్సరం నుంచి అమలవుతున్నందున పంపిణీ కొనసాగుతోందని చెబుతున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సైకిళ్ల పంపిణీ నిలిచిపోయిందన్న ప్రచారం జరుగుతుండటంతో విద్యాశాఖ ఈ విషయమై ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఇది పాత పథకమే అయినందున పంపిణీకి అనుమతించాలని కోరింది.
పాఠశాల బాలికల్లో డ్రాపవుట్లు తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 7938 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2018-19లో 3,74,548 మంది బాలికలు 8,9 తరగతులు చదువుతుండగా, వీరందరికీ సైకిళ్లు పంపిణీ చేయాలన్నది సర్కారు నిర్ణయం. ఇందుకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం ఆరంభంలోనే 3 ఏజెన్సీలకు టెండర్లు ఖరారు చేశారు. డిసెంబరు 23న వాటికి వర్క్ ఆర్డర్ ఇచ్చారు.
తొలుత ఈ ఏడాది జనవరి 31లోగా పంపిణీ పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలిచ్చినప్పటికీ గడువులోగా ఎక్కడా అందజేయలేదు. తర్వాత ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పెంచారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు కేవలం 28,003 మంది (7.48%) విద్యార్థినులకే సైకిళ్లు పంపిణీ కావడంపై విమర్శలొచ్చాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ఏప్రిల్ 23తో ముగియనున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఆయా ఏజెన్సీలపై ఒత్తిడి పెంచింది. ఫలితంగా ఇప్పటి వరకు 30% సైకిళ్లు పాఠశాలలకు చేరాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.60 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది.
