Published: 15-03-2019
ప్రపంచంలో అతితక్కువ ఖర్చుతో వైద్యసేవలు

ప్రపంచంలో అతితక్కువ ఖర్చుతో వైద్యసేవలు అందిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. అమెరికాలో రూ.10వేలు ఖర్చయ్యే వైద్యానికి ఇక్కడ రూ.వెయ్యి సరిపోతాయన్నారు. అందుకే ఆఫ్రికా, ఇంగ్లాండ్, యూరప్ తదితర ప్రాంతాల నుంచి వైద్యం కోసం మన దేశానికి వస్తున్నారన్నారు. ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో సమావేశమయ్యేందుకు ప్రత్యేకంగా కృష్ణాజిల్లా నూజివీడు వచ్చిన ఆయన సభనుద్దేశించి మాట్లాడారు. ప్రపంచంలో వచ్చే మార్పులను దృష్టిలో పెట్టుకుని, భారతీయ విద్యావిధానాన్ని మార్పు చేయాలని, పారిశ్రామిక రంగానికి విద్యను అనుసంధానించడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
విద్యార్థులు తాము అందిపుచ్చుకున్న సాంకేతికతను, గ్రామాభివృద్ధికి ఉపయోగించి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల తారతమ్యాన్ని చెరిపివేయాలన్నారు. అప్పుడే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతుందని పేర్కొన్నారు. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులకు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను రూపొందించాలని వెంకయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి కె.దమయంతి, ఆర్‌జీయూకేటీ చాన్సలర్ రామచంద్రరాజు, నూజివీడు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ డి.సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
