Published: 12-03-2019
కాంగ్రెస్‌లోనే సబితాఇంద్రారెడ్డి?

మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగనున్నారు. గత మూడు రోజులుగా ఆమె టీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ భారీగా ప్రచారం జరిగింది. కేటీఆర్, కవితతో పాటు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌తో సబిత, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి భేటీ కావడంతో వాళ్లిద్దరూ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు సాగాయి. దీనికి తోడు సబిత వైపు నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆమె తన కుమారుడితో కలిసి టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమైపోయిందని అంతా అనుకున్నారు.
ఆమె పార్టీ మారకుండా రేవంత్ రెడ్డి చేసిన రాయబారం ఫలించింది. సబితతో రేవంత్ మాట్లాడటంతో ఆమె మనసు మార్చుకున్నట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్‌లోనే కొనసాగితే ఎలా ఉంటుందనే ఆలోచనకు సబిత వచ్చినట్టు తెలుస్తోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్‌లో ఇమడలేక బయటకు వచ్చేశారని.. టీఆర్ఎస్‌లో చేరాక ఆయనకు ఎదురైన పరిస్థితులు.. మీకూ ఎదురైతే ఏం చేస్తారంటూ సబితకు రేవంత్ నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. నేటి సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సబిత, రేవంత్ భేటీ కానున్నారు.
