Published: 12-03-2019
ప్రిపరేషన్, పరీక్షల సమయంలోనే ప్రచార హోరు

సార్వత్రిక ఎన్నికల నగారాతో రాజకీయ పార్టీల సందడి ఎలా ఉన్నా.. పాఠశాల విద్యార్థుల్లో మాత్రం కలవరం మొదలైంది. రాష్ట్రంలో తొలివిడతలోనే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిస్థితి ఎదురైంది. పోలింగ్ ఏప్రిల్ 11న జరగనున్నప్పటికీ, ఈ నెల 18నే నోటిఫికేషన్ రానుండటంతో అప్పటి నుంచి గ్రామ, పట్టణ, నగర ప్రాంతాలన్నింటా రాజకీయ కోలాహలం మొదలవుతుంది. సరిగ్గా ఈ సమయంలోనే అంటే మార్చి 18 నుంచి రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 3 వరకు ఉంటాయి.. ఇప్పటికే టెన్త్ విద్యార్థులపై ఫస్ట్‌క్లాస్, 10 జీపీఏ ఒత్తిడి ఉంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ దిశగానే పిల్లలను సమాయత్తం చేస్తున్న పరిస్థితి.
పరీక్షల సమయాల్లో రాజకీయ పార్టీల ప్రచార హోరు, సభల కారణంగా విద్యార్థి లోకానికి చదువుల పరంగా కొంత ఇబ్బందులు తప్పవన్న ఆందోళన లు వ్యక్తమవుతున్నాయి. ఇటు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 8 నుంచి 22వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించేలా విద్యా విషయక క్యాలెండర్‌లోనే షెడ్యూల్ ప్రకటించారు. పోలింగ్ ఏప్రిల్ 11న జరగనున్నందున ఇప్పుడు ఆ పరీక్ష ల తేదీలను రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి తప్పనిసరి కానుంది. మరోవైపు.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ రంగ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 1.86 లక్షల మంది ఉపాధ్యాయులుండగా, వారిలో కొంతమందికి ఎన్నికల నిర్వహణ విధులు అప్పగిస్తారు. ఫలితంగా ఆయా టీచర్లు పలుమార్లు ఎన్నికలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉంటుంది.
