Published: 11-03-2019
వేడెక్కిన ఏపీ రాజకీయం

వ్యూహ.. ప్రతివ్యూహాలు పదునెక్కుతూనే ఉన్నాయి. అస్త్రశస్త్రాలు ఏనాడో సిద్ధమయ్యాయి. ఎన్నికల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు అధికార తెలుగుదేశం.. విపక్ష వైసీపీ ఎప్పటి నుంచో కత్తులు నూరుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. తెలుగు రాష్ట్రాల్లో తొలి విడతలో ఏప్రిల్ 11న ఒకే దఫాలో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తరువాత ఎప్పుడో 42 రోజుల ఉత్కంఠ భరిత ఎదురు చూపుల తరువాత మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. సాధారణంగా సమస్యల్లేని ప్రాంతాల్లో తొలి విడతనే పోలింగ్ పూర్తి చేస్తారు. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు పెద్ద సంఖ్యలో సాయుధ సిబ్బంది అవసరం ఉండకపోవడం దీనికి ఒక కారణం.
ఈసారి కూడా అదే లెక్క ప్రకారం తొలివిడతలోనే ముహూర్తం నిర్ణయించినా.. వాతావరణం మాత్రం పూర్తి భిన్నంగా నెలకొనే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ఓట్ల తొలగింపు వంటి అంశాలతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే వేడెక్కింది. ఈ సారి టీడీపీని ఓడించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏపీపై ప్రత్యేక దృష్టి సారించారు. మోదీ, కేసీఆర్, జగన్ ముగుసు తీసేసి ముగ్గురూ కలిసి పోటీకి రావాలని చంద్రబాబు సవాల్ విసురుతున్నారు. 2014 ఎన్నికలు జరిగిన వాతావరణం పూర్తిగా భిన్నమైనది.
