Published: 07-03-2019
మోదీ ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడంలేదో స్పష్టం చేయాలని రాష్ట్ర హైకోర్టు కేంద్రప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై తగిన వివరణ ఇవ్వాలంటూ కేంద్రప్రభుత్వంతో పాటు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని నిబంధనలను అమలుచేయడంతోపాటు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఇటీవల హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. కొణతాల తరఫు న్యాయవాది సీ రఘు వాదనలు వినిపించారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో కేంద్రప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది.
కానీ ఇంతవరకూ వాటిని నెరవేర్చలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని 2014 మార్చిలో కేంద్ర మంత్రివర్గం తీర్మానం చేయడంతోపాటు ఐదేళ్లు కొనసాగించాలని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించింది. అయితే ఆ తరువాత దాని ప్రస్తావనే లేకుండా పోయింది. పునర్విభజన చట్టాన్నీ, ఈ సందర్భంగా ఇచ్చిన హామీలనూ అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది’’ అని రఘు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆర్‌టీఐ ద్వారా నేషనల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌కి దరఖాస్తు చేసుకోగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొన్నారని ఆయన వివరించారు. అయితే ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని విధాలుగానూ వెనుకబడి ఉందని, రాష్ట్రానికి ఆదాయం చేకూర్చిపెట్టే పరిశ్రమల్లో విశాఖ ఉక్కు పరిశ్రమ తప్ప మరేమీ లేదన్నారు. వివిధ రంగాలకు చెందిన 13 మంది నిపుణులతో కూడిన కమిటీ గతంలో ఇదే విషయాన్ని తేల్చిందన్నారు.
2014 నుంచి రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందని, చట్టబద్ధ బాధ్యతలను నిర్వర్తించడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇస్తూ కనీసం రాజధాని కూడా లేని ఆంధ్రకు మాత్రం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని వివరించారు. అందువల్ల ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. ఈ వాదనలపై స్పందించిన ధర్మాసనం, అలా ఆదేశించమని కోరడానికి ఏమైనా చట్టబద్ధమైన ఆధారముందా అని ప్రశ్నించింది. ఇందుకు రఘు బదులిస్తూ.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇచ్చే అధికారముందని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాకపోవడంతో ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దీనస్థితిలో ఉంది. ఈ స్థితిలో ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సమానంగా ఆర్థికంగా నిలదొక్కుకునేలా కేంద్రం సాయం చేయాల్సివుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ఏడాది డిసెంబరులో ఆర్థికస్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఏపీ విభజన చట్ట నిబంధనలు సంపూర్ణంగా అమలు చేయడంతో పాటు ప్రత్యేక హోదా హామీని నెరవేర్చేలా కేంద్రాన్ని ఆదేశించాలి’’ అని అభ్యర్థించారు.
