ఓట్లు తీసేయించేది మేమే

‘మా ఓట్లు తీసేస్తున్నారు’ అని ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదులు చేసిన వైసీపీ అధినేత జగన్... తామే ఇతరుల ఓట్లు తొలగించాలని దరఖాస్తులు ఇచ్చినట్లు మొట్టమొదటిసారిగా అంగీకరించారు. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేలా ఆన్‌లైన్‌లో ఫామ్-7 దరఖాస్తులు తామరతంపరగా వస్తున్నట్లు టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కూడా ఫిర్యాదు చేసింది. ఈ అంశాన్ని ఈసీ సీరియ్‌సగా తీసుకోవడంతోపాటు... తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న వారిపై కేసులు కూడా నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఫామ్-7లు సమర్పిస్తున్నది మేమే’ అని వైఎస్ జగన్ స్పష్టంగా ప్రకటించడం గమనార్హం. దొంగ ఓట్లు తొలగించాలని కోరితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. మంగళవారం నెల్లూరులో జరిగిన ‘సమర శంఖారావం’ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘చంద్రబాబు రాష్ట్రంలో లక్షలాది దొంగ ఓట్లు చేర్చించారు. వాటిని తొలగించాలని ఫామ్-7 ద్వారా కోరాం’ అని తెలిపారు. అదే సమయంలో... వైసీపీకి ఓటు వేస్తారని భావిస్తున్న వారి ఓట్లను టీడీపీ తొలగించే కుట్ర చేస్తోందని అన్నారు. ‘చంద్రబాబు అన్యాయం చేస్తున్నా తప్పు కాదా? దొంగ ఓట్లు తొలగించాలని మేము అడిగితే తప్పా? దొంగ ఓట్ల తొలగింపులో రాజీ పడొద్దు’ అని పార్టీ శ్రేణులకు సూచించారు.
