Published: 04-03-2019
పాక్ మీడియాలో తన వ్యాఖ్యలపై పవన్

‘నేను ఆళ్లగడ్డలో ఒక మాట మాట్లాడితే పాకిస్థాన్ మీడియాలో వస్తుందని కలగన్నానా? అది పట్టుకుని మీరు నా దేశభక్తిని శంకిస్తారా?’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు భారత్-పాక్ యుద్ధం వస్తుందని రెండేళ్ల క్రితమే చెప్పారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘టీడీపీ, వైసీపీ, బీజేపీ సభల్లో ఏనాడైనా జాతీయ జెండాలు కన్పించాయా? ఆ పార్టీల నాయకులు ఏనాడైనా జాతీయ జెండా పట్టుకున్నారా? వాళ్లా దేశభక్తి గురించి మాట్లాడేది? మా సభల్లో మాత్రమే జాతీయ జెండాలు కనిపిస్తాయన్న విషయం గుర్తించుకోండి. ఏ రోజూ నా దేశభక్తిని మీ ముందు రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని పవన్ పేర్కొన్నారు. ఆదివారం చిత్తూరులోని ఓ హోటల్‌లో జనసేన కార్యకర్తలు, విలేకరులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాయలసీమ పర్యటన ముగిసినట్లు చెప్పారు. ‘మీడియాలో నేను ఏదైనా మంచి మాట్లాడితే చూపించరు.
నా మాటల్ని వక్రీకరించి పదే పదే చూపిస్తుంటారు. భగత్‌సింగ్ గురించి మాట్లాడినప్పుడు నేను అన్నది ఏంటి? మీరు చూపించింది ఏంటి?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై పరోక్ష విమర్శలు చేశారు. ‘కారుతో ఇద్దరిని గుద్దేసి.. ఒకరు చనిపోతే ఆగకుండా మరో కారులో వెళ్లిపోయిన కనీస మానవత్వం లేని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు’ అని పవన్ మండిపడ్డారు. ఏదైనా ఎవరికైనా ముందే తెలుస్తుందా అంటూ పలు అంశాలను ఆయన ఉదహరించారు. ‘1997లోనే తెలంగాణ వచ్చేస్తుందన్నారు. 2014లో తెలంగాణ వస్తుందని వారికి ఏమైనా ముందే తెలుసా? నోట్లరద్దు గురించి బ్యాంకర్లు ముందుగానే చెప్పేశారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, మోదీ, నేను కలిసి తిరుగుతున్న సందర్భంలో అవినీతి నిర్మూలనకు పెద్దనోట్ల రద్దు చేయాలన్న ప్రస్తావన వచ్చింది. అలా అని అంతా ముందే ప్లానింగ్ చేసినట్టా? ఉగ్రవాదులున్నారు. దేశసమగ్రతని దెబ్బతీసే వ్యక్తులున్నారు. దేశ అంతర్గత సమగ్రతను నిలువరించే వ్యక్తులూ ఉన్నారు. వారిని ఆపడం దేశభక్తి కాదా?’ అని జనసేనాని పేర్కొన్నారు.
