మద్యం ఉత్పత్తి నుంచి అమ్మకాల వరకూ నిఘా

: ఎన్నికల నేపథ్యంలో మద్యం ఉత్పత్తి నుం చి అమ్మకాల వరకూ అన్ని దశల్లోనూ నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్‌శాఖ కమిషనర్ ఎంకే మీనా తెలిపారు. డిస్టిలరీలు, డిపోలు, చెక్‌పాయింట్లలో సీసీ కెమెరాలు ఏర్పాచేసి, కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిరంతరం పర్యవేక్షిస్తామని వివరించారు. తనిఖీలు చేసే బృందాలకూ బాడీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. శుక్రవారం కమిషనరేట్‌లో మాట్లాడారు. ఎన్నికల సమయం లో ఫిర్యాదుల తక్షణ పరిష్కారం కోసం కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ రెండు నెలల్లోనే నాటుసారాపై 2వేల కేసులు పెట్టి, 24వేల లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామని, బెల్టు షాపులపై 3800 కేసులు పెట్టి 8900 లీటర్ల మద్యం సీజ్ చేశామని వివరించారు. స్టేట్ టాస్క్‌ఫోర్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎమ్మార్పీ ఉల్లంఘనలకు బాధ్యులను చేసి నలుగురు సీఐలను ఆ పోస్టుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. కాగా, ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన డైరీని కమిషనర్ ఎంకే మీనా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ హరికుమార్‌లు ఆవిష్కరించారు. దివ్యాంగులైన చిన్నారులకు ఈ సందర్భంగా స్కూలు బ్యాగులు, బెడ్‌షీట్లు, స్పీకర్ వాచ్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నాగప్రభు కుమార్, కుమరేశ్వన్, ఆదిశేషు, బాలకృష్ణ ఇతరులు బి.నర్సింహులు, మార్పు కోయ్య, అధికారులు కేఎల్ భాస్కర్, చంద్రశేఖర్ నాయుడు, దేవకుమార్, జోసెఫ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
