Published: 23-02-2019

తుపాకులకు క్యూఆర్‌ కోడ్‌ ఉంటేనే.

కర్నూలు: సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని తుపాకులపై పోలీసు శాఖ దృష్టి సారించింది. శాంతిభద్రతల దృష్ట్యా తుపాకులు ఉన్న వారు వాటికి క్యూఆర్‌ కోడ్‌ అనుసంధానం చేసుకోవాలని కర్నూలు ఎస్పీ ఫక్కీరప్ప ఆదేశాలు జారీ చేశారు. పోలీస్‌ కార్యాలయంలో క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ యాప్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్యూఆర్‌ కోడ్‌ లేని తుపాకులను అక్రమ ఆయుధాలుగా పరిగణిస్తామని పేర్కొన్నారు. బ్యాంకుల వద్ద భద్రతా పరంగా సెక్యూరిటీ గార్డులు వినియోగిస్తున్న తుపాకులు డిపాజిట్‌ చేయనవసరం లేదని తెలిపారు. పోలీస్‌ హెడ్‌ క్వార్టర్లను సంప్రదించి క్యూఆర్‌ కోడ్‌ తీసుకోవాలని సూచించారు. జిల్లాలో గన్‌ లైసెన్సులపై ప్రత్యేక దృష్టి సారించామని, గన్‌ లైసెన్సులన్నీ ఈ-కాప్స్‌ ద్వారా డిజిటలైజేషన్‌ చేశామన్నారు. తుపాకులను క్యూఆర్‌కోడ్‌తో స్కాన్‌ చేయడం వల్ల యజమానుల పేరు, గన్‌ లైసెన్సు నెంబర్‌, వెపన్‌ రకం, రెన్యువల్‌ గడువుతేదీ, పోలీ్‌సస్టేషన్‌ పరిధి వంటి వివరాలు వెంటనే తెలుసుకోవచ్చన్నారు. అలాగే తుపాకీ మిస్‌ కాకుండా, దుర్వినియోగం కాకుండా చూసుకోవచ్చునన్నారు. తుపాకిని పోలీ్‌సస్టేషన్‌లో అప్పగించినప్పుడు, తిరిగి తీసుకున్నప్పుడు ఈ క్యూఆర్‌ కోడ్‌ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషినల్‌ ఎస్పీ వెంకటేష్‌, ఈ-కాప్స్‌ ఇన్‌చార్జి రాఘవరెడ్డి, ఎస్‌బీ సీఐ మహేశ్వరరెడ్డి, ఆర్‌ఐ రంగముని ఉన్నారు.