తొలిసారిగా కాలినడకన తిరుమలకు....రాహుల్‌గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దశాబ్ద కాలం తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారిపై నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులకు అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి. ముత్తాత జవహర్‌లాల్ నెహ్రూ, నాయనమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్‌గాంధీ, తల్లి సోనియాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు తరచూ స్వామివారిని దర్శించుకునేవారు. రాహుల్ కూడా 2009 ఏప్రిల్ 17న ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీవారిని దర్శించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఆరంభించడానికి ముందు స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచీ ప్రత్యేక విమానంలో ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ తన మేనల్లుడు రైహన్ వాద్రాతో కలిసి తొలిసారిగా అలిపిరి కాలిబాటన తిరుమల చేరుకున్నారు. రికార్డు సమయంలో 110 నిమిషాల్లోనే కొండెక్కారు. కొండపైకి చేరుకున్నాక జీఎన్‌సీ టోల్‌గేట్ నుంచి గెస్ట్‌హౌస్ వరకు కూడా నడుచుకుంటూనే వచ్చారు. మధ్యాహ్నం 1.45 గంటలకు శ్రీకృష్ణ విశ్రాంతి గృహానికి చేరుకుని.. కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం టీటీడీ అతిథ్యాన్ని స్వీకరించారు. ఆ వెంటనే సంప్రదాయ దుస్తులతో దర్శనానికి బయల్దేరారు.
