Published: 19-02-2019
‘అన్నదాత సుఖీభవ’ చెల్లింపులు మొదలు

రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద చెల్లింపులు మొదలయ్యాయి. సోమవారమే రైతుల ఖాతాల్లో రూ.వెయ్యి జమ చేయనున్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను ఆయా బ్యాంకులకు ప్రభుత్వం బదలాయించింది. ఆధార్ అనుసంధానిత ఖాతాలకు చెల్లింపులు జరపాలని కోరింది. దీంతో... రైతు కుటుంబాల ఆధార్ అనుసంధానిత ఖాతాలకు రూ.వెయ్యి చొప్పున జమ చేసే ప్రక్రియ వెంటనే ప్రారంభమైంది. తొలిరోజున 48.89 లక్షల మంది ఖాతాల్లోకి రూ.వెయ్యి చొప్పున జమ అయ్యాయి. మొత్తం రూ.488.92 కోట్లు రైతుల ఖాతాల్లోకి చేరినట్లు అధికారులు తెలిపారు. ‘మీ ఖాతాలోకి అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.వెయ్యి జమ అయ్యాయి’ అంటూ రైతుల ఫోన్లకు బ్యాంకుల నుంచి సంక్షిప్త సందేశాలు కూడా వచ్చాయి. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం నిర్వహణ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఒక మొబైల్ యాప్‌ను కూడా ఆర్టీజీఎస్ అధికారులు రూపొందించారు. అధికారులకు ప్రత్యేక లాగిన్‌లు ఇచ్చారు. ఆధార్ అనుసంధానంతో జరిగే నగదు బదిలీల ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఎవరైనా http://annadathasukhibhava.ap.gov.in లింక్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. కాగా, ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలుపై వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్‌బాబు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. ‘లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాం. వారి జాబితాను గ్రామంలో ప్రదర్శించాలి. తద్వారా ఆ గ్రామంలో ఎవరికి లబ్ధి కలిగిందో తెలుస్తుంది’ అన్నారు.
