Published: 18-02-2019
నేడు పడగ విప్పి దాడులతో బుసలు

చచ్చిన పాము బతికింది! కొత్తగా కోరలు తొడుక్కొని భారత్‌పై భయంకరంగా బుసలు కొడుతోంది!! ఆ పాము ఎవరో కాదు.. పార్లమెంటుపై దాడి నుంచి 2008లో ముంబైలో దాడుల దాకా ఎన్నో ఘాతుకాలకు ఒడిగట్టిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్. ముంబైపై దాడులతో అప్రమత్తమైన నాటి యూపీఏ సర్కారు కఠిన చర్యలు చేపట్టడంతో 2013 దాకా ఎలాంటి దాడులూ చేయకుండా.. నిష్ర్కియగా ఉండిపోయింది. మసూద్ అజర్ కూడా పెద్దగా హడావుడి చేయకుండా పాకిస్థాన్‌లో ఉండిపోయాడు. ఈ ఐదేళ్లలో కశ్మీర్‌లోయలో జైషే దాదాపుగా కనుమరుగైపోయింది. కానీ, 2013లో భారత ప్రభుత్వం అఫ్జల్‌గురును ఉరి తీశాక మళ్లీ తన ఉగ్ర ప్రసంగాలతో వెలుగులోకి వచ్చాడు. కశ్మీర్‌లోయలో మళ్లీ రిక్రూట్‌మెంట్లకు శ్రీకారం చుట్టాడు. ‘అఫ్జల్ గురు స్క్వాడ్’ పేరుతో ఒక దళాన్ని ఏర్పాటు చేశాడు. తమ వద్ద 300 మంది ఆత్మాహుతి బాంబర్లు ఉన్నారని.. వారితో భారత్‌పైన, అమెరికాపైనా మరిన్ని దాడులు చేయిస్తానని 2014లో ప్రకటించాడు. నవాజ్ షరీఫ్ పాకిస్థాన్ ప్రధాని అయ్యాక భారత్‌తో శాంతికి చర్చలు జరపడంతో చిర్రెత్తిపోయాడు.
భారత ప్రధాని మోదీ 2015 డిసెంబరు 25న లాహోర్‌కు వచ్చి నవాజ్ షరీఫ్ ను కలుసుకొని ఆలింగనం చేసుకోవడంతో మరింత పిచ్చెక్కిపోయాడు. మోదీ వచ్చి వెళ్లిన వారానికే.. జైషే సంస్థ పఠాన్‌కోట్‌లో పంజా విసిరింది. 2008 తర్వాత జైషే మహ్మద్ సంస్థ భారత్‌లో జరిపిన తొలి అతిపెద్ద దాడి అది. మోదీ సర్కారు లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌లపై దృష్టి సారించి ఆ రెండు సంస్థల అగ్రనాయకత్వాన్ని మట్టుబెట్టే పనిలో ఉంటే.. చాపకింద నీరులా జైషే మహ్మద్ దక్షిణ కశ్మీర్ అంతటా తిరిగి తన పట్టు పెంచుకుంది. ఈ విషయాన్ని గమనించి భారత సైన్యం ముగ్గురు జైషే కమాండర్లను (ఖాలిద్ భాయ్, నూర్ మహ్మద్ తాంత్రే, ముఫ్తీ వకాస్) మట్టుబెట్టినా.. అప్పటికే సమయం మించిపోయింది.
లష్కరే, హిజ్బుల్ ఉగ్రవాద సంస్థలను భారత్ పూర్తిగా నిర్వీర్యం చేసిన నేపథ్యంలో జైషే మహ్మద్ కశ్మీర్‌లో అతిపెద్ద ఉగ్రవాద సంస్థగా అవతరించింది. పాక్ నుంచో, పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచో జిహాదీ మూకలను దిగుమతి చేసుకోవడం కాకుండా.. స్థానికులనే చేర్చుకుంటూ బలోపేతమైంది. 2018 జూన్ నాటికి కశ్మీర్‌లో 70 మందికిపైగా ఉగ్రవాదులు జైషే పనుపున పనిచేస్తున్నట్టు అంచనా. ఆపై ఈ సంఖ్య మరింత పెరిగింది. దక్షిణ కశ్మీర్ వారికి బాగా ప ట్టున్న ప్రాంతం. మరీ ముఖ్యంగా.. అవంతిపొరాలోని ట్రాల్ ఏరియా, షోపియాన్, పుల్వామాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్థానికులు జైషే వైపు ఆకర్షితులవుతుండడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుతం అక్కడ జైషే సం స్థను ముగ్గురు కమాండర్లు ఫౌజీ భాయ్ (45), ఓమర్, అర్సలాన్ నడుపుతున్నారు. ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రచించడమే కాదు.. నిధుల కోసం వీరు కిడ్నా్‌పలకు కూడా పాల్పడుతున్నారు.
