Published: 14-02-2019

కాలాన్ని దాటి సాగితేనే విజయం ముఖ్యమంత్రి చంద్రబాబు

అత్యుత్తమ సంతోషస్థాయులతో, అత్యున్నత జీవన ప్రమాణాలతో ప్రపంచంలోని ఎక్కడి వారికైనా అందులోనే నివసించాలనిపించేలా అమరావతి రూపుదిద్దుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘‘పలు రాజధాని నగరాలు కేవలం పరిపాలనా కేంద్రాలుగానే మిగిలిపోవడంతో సాయంత్రమయ్యేసరికి నిర్మానుష్యంగా మారి, నిస్సారంగా, నిర్జీవంగా కనిపిస్తాయి. అమరావతిలో మాత్రం ఆ పరిస్థితి రానీయబోం. నిరంతరం కళకళలాడేలా పలు చర్యలు తీసుకుంటున్నాం’’ అని వివరించారు. అమరావతితోపాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలన్నింటినీ ఆనందాలకు లోగిళ్లుగా మలచే ఉద్దేశ్యంతో సీఆర్డీయే నిర్వహిస్తున్న హ్యాపీ సిటీస్‌ సమ్మిట్‌-2019ను బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి ప్రారంభించారు.
 
 
30కిపైగా దేశాల్లోని పలు నగరాల మేయర్లు, కమిషనర్లతోపాటు వందలాదిమంది నిపుణులు సదస్సుకు హాజరయ్యారు. ఈ నాలుగున్నరేళ్లలో హ్యాపీ సిటీస్‌ సదస్సును సీఆర్డీయే జరపడం ఇది రెండోసారి. అత్యంత నాణ్యమైన జీవనానికి అసలైన చిరునామాగా అమరావతి నిలవబోతోందని సీఎం అన్నారు. ‘‘కాలంతోపాటు, ఆ మాటకొస్తే కాలానికంటే ముందుగానే ఆలోచించి, వినూత్న ఆవిష్కరణలతో, టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ సాగితేనే ఏ నగరమైనా పదికాలాలపాటు మనగలుగుతుంది. కేవలం సంపాదనతోనే సంతోషం కలగదు. నాణ్యమైన నీరు, ఆహారం, గాలితో కూడిన అత్యుత్తమ జీవన ప్రమాణాలను అందిస్తేనే ప్రజలు ఆనందంగా జీవించగలుగుతారు’’ అని వివరించారు.
 
కేవలం ఉన్నతాదాయ వర్గాలకే అమరావతి పరిమితం కారాదన్న భావనతో అల్పాదాయ వర్గాల కోసం 500 ఎకరాల్లో 50వేల గృహాలను నిర్మిస్తున్నామని చెప్పారు. గతంలో జరిగిన పారిశ్రామిక విప్లవాలతో పారిశ్రామికీకరణ జరగ్గా, ప్రస్తుత ఇన్ఫర్మేషన్‌, నాలెడ్జ్‌ విప్లవంతో ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుందని, దీనిని గుర్తించే తాను ‘వయాడక్ట్‌’ సూత్రాన్ని ప్రతిపాదించానని పేర్కొన్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, అలీబాబా వంటి ప్రముఖ సంస్థల విజయరహస్యం సృజనాత్మకతతో కూడిన ఆలోచనలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలోనే ఉన్నదని, ఇదే సూత్రాన్ని మనమూ పాటిస్తే అమరావతి నాలెడ్జ్‌ హబ్‌గా ఎదుగు తుం దని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..