Published: 12-02-2019
పర్లా జాతి పెట్టలు

చక్కగా నృత్యం చేస్తే నెమలితో పోల్చుతారు. అందంగా మాట్లాడుతుంటే చిలుకతో పోలిక పెడతారు. కానీ, ఈ చిత్రాల్లోని కోడి పుంజులను చూస్తే మాత్రం.. నెమలా లేక చిలుకా అనేది పోల్చి చెప్పడం కష్టమే. నెమలి తోక, చిలుక ముక్కు..పర్లా జాతి పుంజుల ప్రత్యేకత ఇది. ప్రకాశం జిల్లా కంభానికి చెందిన కృష్ణమాచారి ఈ జాతి పుంజులను పెంచుతున్నారు. ఆయన ఇల్లు ఇప్పుడు స్థానికులకే కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వారికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆయన పుంజుల ఖ్యాతి ఎల్లలు దాటి అరబ్ దేశాలను విపరీతంగా ఆకట్టుకొంటోంది. కువైత్ నుంచి వచ్చిన ఖలీద్ అనే సేట్ రూ. 1.25 లక్షలు ఇచ్చి కృష్ణమాచారి నుంచి పుంజును కొనుగోలు చేశారు.
అలాగే మరో రెండు కోళ్లను రూ.1.75లక్షలకు దుబాయ్ వాసులు కొనుక్కొని వెళ్లారు. ఈ జాతి కోడి పెట్టే గుడ్డూ ఖరీదే మరి! ఒక గుడ్డు అక్షరాల వెయ్యి రూపాయలు పలుకుతోంది. కోళ్ల పెంపకంపై పెంచుకొన్న మక్కువే ఇప్పుడు కృష్ణమాచారి కుటుంబానికి ముద్ద పెడుతుండటం విశేషం. ఇంటర్, ఐటీఐ చదివిన ఆయన కుల వృత్తియైున వడ్రంగి పని వదిలి కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. ఏడాది పాటు దేశమంతా తిరిగి తమిళనాడు నుంచి పర్లా వంటి ఉత్తమ జాతి కోళ్లను తెచ్చారు. తన దగ్గర ఉన్న రెండు కాకిడేగల పిల్లలతో ఆ జాతి కోళ్లను సంక్రమణం చేయించారు. పర్లా జాతి ఠీవీ, అందమూ, కాకి డేగ బలిష్టతా కలగలసిన కొత్త జాతి ఉద్భవించింది.
పర్లా జాతితో పోల్చితే రెట్టింపు అందంతో ఈ కోళ్లు, పుంజులు ఉండటంతో మంచి ధర పలుకుతోంది. తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. కోళ్ల అమ్మకాలపై నెలకు రూ.40వేలు నుంచి రూ.50వేలు వరకు సంపాదిస్తున్నానని కృష్ణామాచారి తెలిపారు. కోడిపెట్టలు, పిల్లల పెంపకానికి నెలకు రూ.15వేలకుపైగా కృష్ణమాచారి ఖర్చు పెడుతున్నారు.
ఆన్‌లైన్‌లో కంభం కోడి
తమిళనాడు వ్యాపారులు ఆరునెలల పిల్లలను , గుడ్లను కృష్ణమాచారి నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అలాగే, ఒడిసా, పశ్చిమబెంగాల్, కర్ణాటక, కేరళల నుంచీ కోళ్ల పెంపకందారులు వస్తున్నారు. ఈ డిమాండ్‌ను గమనించిన కృష్ణమాచారి తాజాగా ఆన్‌లైన్ విక్రయాలూ ప్రారంభించారు. పిల్లలు ఉత్పత్తి అయిన వెంటనే వాట్సప్, ఫేస్‌బుక్‌లో వాటి ఫొటోలు పెడితే కొనుగోలుదారులు చూసి, అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటారని, ఆన్‌లైన్‌లో చెల్లింపుల తర్వాత నిర్ణయించిన తేదీకి వారు వచ్చి కోళ్లను తీసుకువెళతారని కృష్ణమాచారి తెలిపారు. తానుసింహా అని మద్దుగా పిలుచుకునే పర్లా జాతి కోడిపుంజు 5 సార్లు ఉత్తమ అవార్డు సాధించినట్లు ఆయన తెలిపారు. కృత్రిమంగా కాకుండాసహజ పద్ధతిలో కోళ్లను పెంచుతున్న తీరును గుర్తించిన అధికారులు రెండుసార్లు కృష్ణమాచారిని సంక్రాంతి సందర్భంగా సత్కరించారు.
