Published: 11-02-2019
లెక్కలు అడుగుతున్నందుకే కోపం..

ఈ ఎన్నికల్లో ‘తండ్రీ కొడుకుల’ సర్కారు పతనం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. అవినీతి ప్రభుత్వంపోయి స్వచ్ఛమైన సర్కారు వస్తుందన్నారు. ఆదివారం గుంటూరులో బీజేపీ నిర్వహించిన ‘ప్రజా చైతన్య’ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టి... తెలుగుదేశంపై విరుచుకుపడ్డారు. ‘‘ఈ దేశాన్ని చీకట్లో దశాబ్దాల తరబడి చీకట్లో ఉంచిన వారే ఇప్పుడు ఒక అబద్ధపు ప్రచారాన్ని మొదలుపెట్టారు. మహాకూటమి పేరిట మహా మోసం చేస్తున్నారు. ఇక్కడి ముఖ్యమంత్రి కూడా ఏపీ అభివృద్ధిని వదిలేసి, మహా కూటమిలో భాగస్వామిగా మారి, నన్ను తిట్టే పోటీలో పాల్గొంటున్నారు’’ అని విమర్శించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల దశ మారుస్తానని (టర్న్ అరౌండ్) సీఎం చెప్పారు. కానీ, ఆయనే యూ టర్న్ తీసుకున్నారు. అమరావతిని నిర్మిస్తానని, రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తానని చెప్పి... కూలిపోయిన తన పార్టీని పునర్ నిర్మించుకుంటున్నారు.
ఏపీని సన్ రైజ్ (సూర్యోదయ) రాష్ట్రంగా మారుస్తామని మాట ఇచ్చి... ఎస్‌ఓఎన్- సన్‌రైజ్ (పుత్రోదయం)తో తన కుమారుడిని పైకితేవడంలో నిమగ్నమయ్యారు. పేదల కోసం కొత్త పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి... మా పథకాలకే ఆయన స్టిక్కర్ తగిలించుకుంటున్నారు’’ అని ప్రధాని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడుస్తానన్న ముఖ్యమంత్రి... చివరికి ఆయన స్ఫూర్తికే తూట్లు పొడిచారని మోదీ విమర్శించారు. ‘‘మీరే చెప్పండి... ఎన్టీఆర్ కలలను నిజం చేయాల్సిన బాధ్యత బాబుకు ఉందా, లేదా? టీడీపీ నేపథ్యాన్నే ఎందుకు మరిచిపోయారు? ఢిల్లీలోని రాజకీయ కుటుంబం (కాంగ్రెస్) ముందు ఎందుకు తలవంచారు?’’ అని మోదీ ప్రశ్నించారు.
‘‘కాంగ్రెస్ నుంచి, కుటుంబ పార్టీ నుంచి దేశానికి విముక్తి కల్పించాల్సిన తెలుగుదేశం నాయకులు... ఇప్పుడు అదే పార్టీ కుటుంబానికి మోకరిల్లారు. ‘దుష్ట కాంగ్రెస్’ అని ఎన్టీఆర్ విమర్శించగా... అదే కాంగ్రెస్‌ను దోస్తుగా చేసుకున్నారు. ఇది చూసి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది’’ అని అన్నారు. స్వార్థంతో రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రె్‌సకే టీడీపీని సమర్పించుకున్నారని ధ్వజమెత్తారు.
